logo

‘రివర్స్‌ గేర్‌లో రాష్ట్రంలో పాలన’

‘కొత్త ప్రభుత్వం అధికారంలో వస్తే మంచి పథకాలు రావాలి... ప్రజలకు మేలు జరగాలి... అలా కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చాక పాలన పూర్తిగా రివర్స్‌ గేర్‌లో నడుస్తుంది.. మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు.

Updated : 09 May 2024 05:58 IST

స్థిరాస్తి వాపారుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ‘కొత్త ప్రభుత్వం అధికారంలో వస్తే మంచి పథకాలు రావాలి... ప్రజలకు మేలు జరగాలి... అలా కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చాక పాలన పూర్తిగా రివర్స్‌ గేర్‌లో నడుస్తుంది.. మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు. ఎక్కడ మార్పు వచ్చింది... రాష్ట్రంలో అద్భుతంగా దూసుకుపోతున్న స్థిరాస్థి వ్యాపారం పూర్తిగా కుప్పకూలడంలో మార్పు వచ్చింది.. వ్యవసాయ పొలాల వద్ద కాలిపోయే మోటార్లు, దొంగ రాత్రి కరెంటు, రైతుల జీవితాలను చీకటిమయం చేయటంలో మార్పు వచ్చింద’ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట పట్టణంలోని శివానుభవ మంటపంలో బుధవారం మెదక్‌ పార్లమెంటు భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన స్థిరాస్తి వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భాజపా, కాంగ్రెస్‌ రెండూ రాష్ట్రానికి గాడిద గుడ్డే ఇచ్చాయని విమర్శించారు. అనంతరం ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేక రాష్ట్రం దివాలా తీసిందని ప్రచారం చేయటం వల్ల పెట్టుబడులు రావటం లేదన్నారు. సిద్దిపేట జిల్లాను ఎత్తివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. సిద్దిపేట ప్రతిష్ఠను కాపాడుకోవాలని, ఇందుకోసం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కల్పిత దృశ్యాలతో ప్రజలను భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, స్థిరాస్తి వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్‌రెడ్డి, భారాస నాయకులు సంపత్‌రెడ్డి, లోక లక్ష్మీరాజం, రవీందర్‌రెడ్డి, బచ్చు రమేశ్‌, దరపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని