logo

నేతల చూపు.. పల్లెల వైపు

గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు.

Published : 09 May 2024 01:17 IST

పోలింగ్‌ శాతం ఎక్కువగా ఉండటంతో పార్టీల ఆసక్తి

శేరిలాలో ఉపాధి కూలీల వద్ద నాయకుల ప్రచారం

న్యూస్‌టుడే, చేగుంట, మెదక్‌, సిద్దిపేట: గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. అందువల్ల పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి సారిస్తున్నారు. పల్లె ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. వారిని చైతన్యం చేస్తే తప్పకుండా తమకే ఓటు వేస్తారనే నమ్మకంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో వివిధ పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తలు పల్లెల్లోనే తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో 80శాతం

మెదక్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, నర్సాపూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాలకు చెందిన ముఖ్యనాయకులు ప్రచారం చేసేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తున్నారు. వీరు పట్టణాల్లోనే రోడ్‌షోలు, బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొంటున్నారు. కానీ ప్రతి ఎన్నికల్లో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదు అవుతోంది. అందువల్ల గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం కేవలం 60 నుంచి 70 శాతం నమోదైంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 70 నుంచి 80 శాతం వరకు నమోదైంది. దీంతో పార్టీలన్నీ పల్లె ఓట్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. గతంలో ఎన్నికల అధికారులు ఓటింగ్‌ శాతం పెంచేందుకు ముమ్మరంగా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అంతగా కనిపించడంలేదు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటంతో పట్టణ పోలింగ్‌ ఏ విధంగా ఉంటుందోనని పార్టీలు భయపడుతున్నాయి.

నియోజకవర్గాల్లో తగ్గుదల

2019 సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద పట్టణ నియోజకవర్గాలైన సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్‌చెరులో పోలింగ్‌ శాతం తగ్గింది. అదే గజ్వేల్‌, దుబ్బాక, మెదక్‌, నర్సాపూర్‌లో పెరిగింది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉండటంవల్ల ప్రజలు ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న పటాన్‌చెరులో పోలింగ్‌ శాతం తగ్గుతుంది. కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా ఉండటంవల్ల వారు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపించడంలేదు. అందువల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం తమ నాయకులను గ్రామాలకు పంపించి ప్రచారం చేయిస్తున్నారు. అప్పుడు పటాన్‌చెరులో 65.09 శాతం, సంగారెడ్డిలో 69.62 శాతం, సిద్దిపేటలో 68.17 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో 70 శాతం కంటే ఎక్కువగా జరగటం విశేషం. గ్రామాల్లో ఓటు ఉండి పట్టణాల్లో నివాసం ఉంటున్న వారు సైతం గ్రామాలకు వచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. వారిని కూడా రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉపాధి కూలీలే లక్ష్యంగా..

గ్రామాల్లో ఉదయం, సాయంత్రం పార్టీ నాయకులు వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఉదయం మాత్రం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి తమ పార్టీల గురించి చెబుతూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఒకే దగ్గర 200 మంది కూలీలు ఉంటున్నారు. ఒక రోజు ఒక పార్టీ వారు వెళితే.. ఇంకో రోజు మరో పార్టీ వారు వెళ్తున్నారు. సుమారు గంట పాటు వారి వద్దనే ఉంటున్నారు. ఎండ ఎక్కువగా ఉన్నందున ఉదయం వేళ పోలింగ్‌ శాతం పెరిగే ఆస్కారం ఉంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌  నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం

నర్సాపూర్‌... 77.29
గజ్వేల్‌...... 76.50
దుబ్బాక..... 73.68
మెదక్‌....... 72.84
సంగారెడ్డి.. 69.62
సిద్దిపేట..... 68.17
పటాన్‌చెరు.. 65.09

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని