logo

దూరం.. ఉపకారం

ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలను అందిస్తోంది.

Published : 04 Dec 2022 05:00 IST

1 నుంచి 8వ తరగతులకు నిలిపి వేసిన ప్రభుత్వం

కోదాడ, న్యూస్‌టుడే: ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలను అందిస్తోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉపకార వేతనాలు నిలిపివేస్తున్నట్లు తాజాగా కేంద్రం వెల్లడించింది. అయితే ఈ ఏడాది మైనారిటీ ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ఈ ఏడాది 5,277 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎనిమిదో తరగతి వరకు ఈ పథకం నిలిపి వేయడంతో 4,377 మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం అయ్యారు. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి నెల రూ.100, 5 నుంచి 10వ తరగతి వరకు రూ.350 చొప్పున ఏడాది కాలంలో 10 నెలలు అందుతాయి. ప్రవేశ ఫీజు కింద ఏడాదికి రూ.5,00, పుస్తకాలు అందిస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ పథకం నిలిపివేయడంతో ఆ కుటుంబాలపై ఈ మేరకు ఆర్థికం భారం పడనుంది.

కారణాలు..

విద్యా హక్కు చట్టం కింద 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తోంది. దీంతో సామాజిక న్యాయ, గిరిజన మంత్రిత్వ శాఖలు కేవలం 9,10 తరగతి వారికే ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలు అందిస్తున్నాయి. దీంతో ఇదే తరహాలో మైనారిటీ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలను 1 నుంచి 8వ తరగతి వరకు తొలగించి 9, 10వ తరగతులకు కొనసాగించిందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.


దరఖాస్తు తర్వాత తొలగింపు

- షేక్‌ అబీద్‌ నల్లబండగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,  కోదాడ

నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఈ ఏడాది మైనారిటీ ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకున్నాను. గతంలో ప్రతి నెల రూ.350 అందేవి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం తొలగించింది. దీంతో ప్రభుత్వం అందించే ఆర్థిక భరోసాను కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి.


9, 10వ తరగతులకు..

-మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, నల్గొండ

ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అమలులో ఉండటంతో మైనారిటీ ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర విద్యార్థుల మాదిరిగానే 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని