logo

డ్రైవింగ్‌ స్కూళ్ల దందా..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రైవింగ్‌ స్కూళ్ల దందా..మూడు పువ్వులు.. ఆరుకాయలుగా నడుస్తోంది. కరోనా తర్వాత ప్రజలు సొంత వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

Updated : 31 Mar 2023 06:19 IST

నీలగిరిలో పాత వాహనంతో శిక్షణ ఇస్తున్న డ్రైవింగ్‌ స్కూల్‌ వాహనం

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రైవింగ్‌ స్కూళ్ల దందా..మూడు పువ్వులు.. ఆరుకాయలుగా నడుస్తోంది. కరోనా తర్వాత ప్రజలు సొంత వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, యువత, గృహిణులు డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో డ్రైవింగ్‌ స్కూల్స్‌ పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కేవలం 16 డ్రైవింగ్‌ స్కూల్స్‌ అనుమతి పొందగా.. క్షేత్రస్థాయిలో అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.


శిక్షణ లేకుండానే ఫాం-5 జారీ

ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 హెవీ డ్రైవింగ్‌ స్కూళ్లల్లో ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే అభ్యర్థుల నుంచి రూ.20-25వేల వరకు డబ్బులు తీసుకొని ఫాం-5 జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్‌ స్కూలు నెలకు 16 మందికి శిక్షణ ఇచ్చేలా అధికారులు అనుమతి ఇచ్చారు. స్కూళ్ల యాజమాన్యాలు అభ్యర్థులకు నెలలో 25 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు హాజరు పత్రాలను ఆర్టీవో అధికారులకు చూపించాలి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఫాం-5 ఇస్తున్నారు. దీంతో హెవీ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు.


పాత వాహనాలతోనే..

పాత వాహనాలకు మరమ్మతులు చేసి వాటిని శిక్షణకు ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చే డ్రైవర్‌కు మెకానికల్‌ డిప్లొమా అర్హత ఉండాలి. వాహనం నేర్చుకునే వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలి. రేడియేటర్‌, ఇంజిను, టైర్లు చెక్‌ చేసుకోవడం, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ట్రాఫిక్‌ నిబంధనలుపై అవగాహన కల్పించాల్సి ఉంది. అనుభవం లేని డ్రైవింగ్‌తో నిత్యం వందల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ వాహనాలు, అనుభవం కలిగిన డ్రైవర్లను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


చర్యలు తీసుకుంటాం
- సురేందర్‌రెడ్డి, జిల్లా రవాణాశాఖాధికారి నల్గొండ

డ్రైవింగ్‌ స్కూళ్ల శిక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అనుమతికి విరుద్ధంగా వాహనాలు ఉపయోగించిన, నిబంధనల మేరకు శిక్షణ తరగతులు నిర్వహించకుండా ఫాం-5 జారీ చేసినా.. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతి పొందిన వాహనాల ద్వారా కాకుండా ఇతర వాహనాలను ఉపయోగించి శిక్షణ ఇచ్చిన కేసులు నమోదు చేయడంతోపాటు స్కూళ్ల అనుమతి రద్దు చేస్తాం.
చండూరు మండలవాసి హెవీ వెహికల్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పెద్ద వాహనాలు నడిపినట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే లైసెన్స్‌ జారీ చేస్తామని చెప్పడంతో ఏజెంటు ద్వారా డ్రైవింగ్‌ స్కూల్‌ను సంప్రదించాడు. డ్రైవింగ్‌ స్కూల్‌ ధ్రువపత్రానికి రూ.20000, లైసెన్స్‌ ఇతరత్రా ఖర్చులకు మరో రూ.8000 మొత్తం రూ.28000 సమర్పించుకున్నాడు.

నల్గొండ పట్టణానికి చెందిన లవకుమార్‌ కారు డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు పట్టణంలోని ఓ డ్రైవింగ్‌ స్కూల్‌ను ఆశ్రయించగా.. రూ.6500 ఫీజు వసూలు చేశారు. పూర్తి స్థాయిలో డ్రైవింగ్‌ నేర్పించాలంటే మరో 15 రోజుల ఫీజు చెల్లిస్తే నేర్పుతామని చెప్పడంతో విధి లేక మరో రూ.4500 చెల్లించాడు. ఇలా వేలాది మంది నుంచి డ్రైవింగ్‌ నేర్పిస్తామని, అనుభవ పత్రాలు, లైసెన్స్‌ ఇప్పిస్తామని డ్రైవింగ్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు రూ.లక్షల్లో దోపిడీ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని