logo

నిమ్మకు తెగులు.. ఆందోళనలో రైతులు

జిల్లాలో పండ్ల తోటల సాగులో మామిడి తర్వాత రెండో స్థానంలో నిమ్మ ఉంది. నిమ్మ తోటల సాగులో నడిగూడెం మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో 3వేల ఎకరాల పైచిలుకు నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి.

Published : 08 Jun 2023 03:25 IST

చెన్నకేశవాపురంలో తామర తెగులు సోకి వడబారిపోయిన నిమ్మ చెట్లు

నడిగూడెం, న్యూస్‌టుడే: జిల్లాలో పండ్ల తోటల సాగులో మామిడి తర్వాత రెండో స్థానంలో నిమ్మ ఉంది. నిమ్మ తోటల సాగులో నడిగూడెం మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో 3వేల ఎకరాల పైచిలుకు నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. ఇక్కడ పండించిన నిమ్మకాయలను రైతులు ఏలూరు, విజయవాడ, హైదరాబాదు మార్కెట్లతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. మూడేళ్ల నుంచి ప్రకృతి వైపరీత్యాలకు తోడు తెగుళ్లు నిమ్మ రైతును కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. తెగుళ్ల నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ల వల్ల ఈ ఏడాది నిమ్మ తోటల్లో కాపు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్కెట్‌లో నిమ్మకాయలకు మంచి ధర పలికింది. మార్చిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో నిమ్మకాయల ధర రూ.100 వరకు పలికింది. కానీ తెగుళ్ల కారణంగా తోటల్లో కాతలేకుండా పోయిందని రైతులు వాపోయారు. నిమ్మకాయలు పూర్తి స్థాయిలో కాపువస్తే మార్కెట్‌లో ధర ఉండదు. ధర ఉన్నప్పుడు పంట లేకుండా పోవడంతో గత మూడు సీజన్ల నుంచి నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

నిలువునా నష్టాలు

ఏళ్ల తరబడి పెంచుతున్న నిమ్మతోటల్లో తామర, ఎండుపుల్ల, గజ్జి తెగుళ్లతో చెట్లు నిలువునా వడబారిపోయి, ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. తెగుళ్ల నివారణకు కనీసం సలహాలు, సూచనలిచ్చే అధికారులు కరవయ్యారని, మార్కెట్‌లో దుకాణదారులిచ్చే మందులనే వేల రూపాయలతో కొనుగోలు చేసి నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో తోటల సాగు, చీడపీడల, తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సులు నిర్వహించేవారని, మూడేళ్ల నుంచి సదస్సులు, సలహాలు సూచనలు అందడం లేదని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని క్షేత్రస్థాయిలో నిమ్మతోటలు పరిశీలించి, తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తలతో అవగాహన ఏర్పాటుచేసి నిమ్మ తోటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.


మందుల కోసం రూ.12 లక్షలు ఖర్చుచేశా..
- ప్రసాద్‌, రైతు, చెన్నకేశవాపురం

నిమ్మలో తామర తెగులు, ఆకుముడత, ఎండు తెగులు నివారణ కోసం ఈ సీజన్‌లో రసాయనిక మందుల పిచికారీ చేయడానికి రూ.12 లక్షల వరకు ఖర్చు చేశాను. కానీ తెగుళ్లు అదుపులోకి రాలేదు. కాపులేక రూ.3 లక్షల ఆదాయం కూడా రాలేదు. కాపునకు నష్టం వాటిల్లడంతో పాటు, చెట్లు వాడిపోతున్నాయి. అధికారులు, శాస్త్రవేత్తలు తోటలను పరిశీలించి తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలి. రైతులకు అవగాహన కల్పించాలి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని