logo

సూర్యాపేట..ఖ్యాతి చాటేలా..!

సూర్యాపేట జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. జిల్లా పరిపాలన సౌధం అయిన కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో), వైద్య కళాశాల భవనం, సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు రేపు (ఆదివారం ఆగస్టు 20వ తేదీ) సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

Updated : 19 Aug 2023 05:51 IST

ఈనాడు, నల్గొండ : సూర్యాపేట జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. జిల్లా పరిపాలన సౌధం అయిన కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో), వైద్య కళాశాల భవనం, సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు రేపు (ఆదివారం ఆగస్టు 20వ తేదీ) సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు భవనాల నిర్మాణానికి రూ.288.50 కోట్లు ఖర్చు చేశారు. జిల్లా భారాస పార్టీ కార్యాలయాన్ని సైతం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ భవనాల డ్రోన్‌ ఫొటోలను మంత్రి జగదీశ్‌రెడ్డి సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో పంచుకున్నారు.


ముస్తాబైంది ఇలా.. వైద్య కళాశాల

వైద్యకళాశాల, విద్యార్థుల వసతిగృహాల సముదాయం

రూ.156 కోట్లతో.. 20 ఎకరాల విస్తీర్ణంలో..ఆరు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఎనిమిది విభాగాలుగా దీనిని నిర్మించారు. ఇందులో జీ+5 నిర్మాణంలో కళాశాల, బాలుర, బాలికల వసతిగృహాలతో పాటూ ప్రిన్సిపల్‌, సిబ్బంది క్వార్టర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆరు ఎకరాల్లో పచ్చదనం కోసం చెట్లను పెంచుతున్నారు. 900 మందికి వసతి కల్పించేలా వసతిగృహాలను విశాలమైన భవనాలుగా తీర్చిదిద్దడం విశేషం.


పచ్చ‘ధనం’లో.. కలెక్టరేట్‌ భవనం

కలెక్టరేట్‌

రూ.64 కోట్ల అంచనా వ్యయంతో.. 21 ఎకరాల్లో.. 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. జీ+2 అంతస్తుల్లో 37 శాఖలకు చెందిన ఉద్యోగులకు గదులు, క్వార్టర్స్‌ను కేటాయించారు. పది ఎకరాల్లో పచ్చదనం, ల్యాండ్‌స్కేప్‌ను సూర్యుడి ఆకారంలో తీర్చిదిద్దారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్‌ మొత్తం సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకు రూ. 65 లక్షలతో 100 కిలో వాల్ట్‌ల సామర్థ్యంతో ప్లాంటును కలెక్టరేట్‌ భవనంపై ఏర్పాటు చేశారు.


రాజభవనం తరహాలో.. డీపీవో కార్యాలయం

జిల్లా పోలీసు కార్యాలయం

రూ.38.50 కోట్లతో.. 20 ఎకరాల్లో 60 వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో డీపీవోను నిర్మించారు. రాజభవనం ప్రాసాదం డిజైన్‌లో తీర్చిదిద్దారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను ఇందులో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా నేరుగా పర్యవేక్షించొచ్చు. ప్రజలు తమ అర్జీలను ఇచ్చేందుకు విశాలమైన గ్రీవెన్స్‌హాల్‌ను నిర్మించారు. కార్పొరేట్‌ భవనం తరహాలో రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా ఇదే అతిపెద్ద పోలీసు కార్యాలయమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


ఆసియాలోనే అతిపెద్దగా.. సమీకృత మార్కెట్‌

సమీకృత వెజ్‌ - నాన్‌వెజ్‌ మార్కెట్‌

రైతులు పండించిన వ్యవసాయ, మాంసం ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించి వాటికి డిమాండ్‌ పెంచే లక్ష్యంతో ఆసియాలోనే అతిపెద్దదైన సమీకృత మార్కెట్‌ను ఇక్కడ నిర్మించారు. విద్యుత్తు అవసరం లేకుండానే మార్కెట్లో వెలుతురు, చల్లనిగాలి వచ్చేలా గ్రీన్‌ బిల్డింగ్‌ తరహాలో నిర్మాణాలు చేయడం విశేషం. రూ.30 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణం, 2.5 లక్షల ఎకరాల చదరపు అడుగుల్లో దీనిని తీర్చిదిద్దారు. ఐదు బ్లాకుల్లో 200 కంటే ఎక్కువ దుకాణాలు ఉండేలా నిర్మాణాలు చేశారు. రోజులో పది గంటల పాటూ వెలుతురు వచ్చేలా రూఫ్‌టాప్‌ డిజైన్‌ చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని