logo

ఈత సరదాలో ప్రాణాలు కోల్పోయేవాడిని

మా ఊరు.. మోత్కూరు మండలం సదర్శాపురంలో వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి తాటి ముంజల కోసం చెట్ల వద్దకు వెళ్లేవాళ్లం. ఒకసారి స్నేహితుల ప్రోద్బలంతో కల్లు తాగాం.

Updated : 06 Apr 2024 05:12 IST

- డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు, సమాచార హక్కు శాఖ ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన కమిషనర్‌

మా ఊరు.. మోత్కూరు మండలం సదర్శాపురంలో వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి తాటి ముంజల కోసం చెట్ల వద్దకు వెళ్లేవాళ్లం. ఒకసారి స్నేహితుల ప్రోద్బలంతో కల్లు తాగాం. ఆ విషయం మా అమ్మానాన్నలకు తెలిసింది. నన్ను తీవ్రంగా మందలించారు. దాంతో ఆ రోజు నుంచి నేటి వరకు కల్లే కాదు.. మద్యానికి దూరంగా ఉంటున్నా. నాతోపాటు నా కుటుంబ సభ్యులూ దానివంక కన్నెత్తి కూడా చూడరు. అలా.. వేసవి సెలవులు నాకు జీవితాంతం గుర్తుంటాయి. ఆ రోజుల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లేవాళ్లం. మిత్రులు బావిలో దూకడంతో ఈత రాకున్నా నేనూ దూకాను. అప్పటికే మూడుసార్లు నీటిలో మునిగాను. వెంటనే అక్కడున్న మా గ్రామస్థుడు లింగయ్య అనే వ్యక్తి నీటిలోకి దూకి నన్ను కాపాడారు. లేకుంటే.. నా ప్రాణాలు పోయేవని మావాళ్లు చెప్పారు. నేను నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో, ఆ తదుపరి గుండాల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. స్నేహితులతో కలిసి చిర్రగోనే ఆట బాగా ఆడేవాడిని. గుండాలలో పీఈటీ రాంచంద్రయ్య సార్‌ మాతో వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ బాగా ఆడించేవారు. అప్పటి రోజుల్లో క్రీడా, సాంస్కృతిక పోటీలు బాగా నిర్వహించేవారు. ఆ పోటీల్లో ఆటలతో పాటు రికార్డింగ్‌ డ్యాన్స్‌లోనూ అనేక సార్లు బహుమతులు వచ్చాయి. పోటీలు పడి చదువుకునే వారిమి. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలు పడి బహుమతులు గెలుచుకునే వాళ్లం.

చరవాణికి దూరంగా ఉంటేనే..

నేటి విద్యార్థులు, యువకులు ఈ వేసవి సెలవుల్లో చరవాణికి దూరంగా ఉండి స్వగ్రామాలకు వెళ్లి అప్పటి స్నేహితులు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో గడిపితే ఆ మధురానుభూతులే వేరుగా ఉంటాయి. ముఖ్యంగా వారు చదువుకున్న పాఠశాలలకు స్నేహితులతో కలిసి వెళ్లి అప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకుంటే.. ఈ సెలవులను మరింత సరదాగా గడపొచ్చు. మేధావుల పుస్తకాలను చదవడం వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది.

న్యూస్‌టుడే, మోత్కూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని