logo

దోచేస్తున్నారు.. గొలుసు దొంగలు..!

రోజుకోచోట ఒంటరి మహిళల పుస్తెలతాడులు, చిన్న పాటి గొలుసులను లాక్కెళ్తున్న ఘటనలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి..

Updated : 16 Apr 2024 05:56 IST

భువనగిరి, భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: రోజుకోచోట ఒంటరి మహిళల పుస్తెలతాడులు, చిన్న పాటి గొలుసులను లాక్కెళ్తున్న ఘటనలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.. ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఈ చైన్‌ స్నాచర్లు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ప్రత్యేక ముఠా జిల్లాలో ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 15కు పైగా ఘటనలు జరిగాయి. నాలుగు ఘటనల్లో పట్టుబడ్డ వారు స్థానికులే కావడం గమనార్హం. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.

వరస ఘటనలతో కలవరం

ఆరుబయట పడుకున్న, ఒంటరిగా వెళ్తున్న మహిళలనే లక్ష్యంగా చేసుకున్న గొలుసు దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను పోలీసులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కేసులను పరిశీలిస్తే దుండగులు పక్కా ప్రణాళికతో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు విధితమవుతోంది. ప్రధాన రహదారులకు సమీపంలో గ్రామాలను ఎంచుకుంటున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, జనం కంటపడకుండా గ్రామ శివారులోని ఇళ్లు, పొలాలకు వెళ్లే వారిని ఎంచుకుంటున్నారు. ఎవరూ గుర్తించకుండా హెల్మెట్‌, మాస్కులు ధరించి ద్విచక్ర వాహనాలపై వస్తూ మహిళల మెడలపై నుంచి గొలుసులు లాక్కెళ్తున్నారు.

  • భువనగిరి మండలం వీరవెల్లిలో ఆరుబయట నిద్రిస్తున్న శ్రీలత అనే మహిళ మెడపై నుంచి ఐదుతులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఆత్మకూర్‌(ఎం)లో ఇంటి మేడపై నిద్రిస్తున్న మేకపోతుల నర్మద అనే మహిళ పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనలు శనివారం తెల్లవారు జామునే జరగడం గమనార్హం. ఇవి  మరవక ముందే మరుసటి రోజు ఆదివారం తెల్లవారు జామున ఆలేరు మండలం కందిగడ్డతండాలో ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళపై మంగళసూత్రాన్ని లాక్కెళారు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఒక చోట పాల్పడి మరో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. భువనగిరి మండలం హన్మాపూర్‌, బస్వాపూర్‌, చౌటుప్పల్‌లో మాత్రం సీసీ కెమెరాల ఆధారంగా చైన్‌స్నాచర్లను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన కేసులు పురోగతిలో ఉన్నాయి. గ్రామాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలనే టార్గెట్‌ చేస్తున్నందున గుంపుగా వెళ్లడం, విలువైన బంగారు ఆభరణాలు ధరించకుండా వెళ్లడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

గాలింపు ముమ్మరం.. ప్రజల అప్రమత్తత అవసరం

- రాజేశ్‌ చంద్ర, డీసీపీ, భువనగిరి జోన్‌

వరస గొలుసు చోరీలతో అప్రమత్తమయ్యాం. రాత్రి పెట్రోలింగ్‌ పెంచాం. గ్రామ వాలంటీర్లను గస్తీ తిప్పుతున్నాం. ఆరుబయట నిద్రిస్తున్న మహిళలను ఇళ్లలో పడుకోవాలని సూచించాం. ప్రత్యేక ముఠా తిరుగుతున్నట్లు సమాచారం. పొలాలకు వెళ్లే మార్గాల్లో జరిగిన ఘటనల్లో ఆధారాలు లభించకపోవడం కష్టంగా మారింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. రాత్రి గస్తీలో వాహనాల తనిఖీల్లో ఓ అనుమానితుడిని పట్టుకుని విచారించగా ఎల్‌బీనగర్‌, యాచారంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తేలడంతో అక్కడి పోలీసులకు అప్పగించాం. జిల్లాలో 421 గ్రామాలు ఉన్నాయి. పోలీసుల ఒక్కరితోనే నిందితులను పట్టుకోవడం సాధ్యం కాదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.


తేరుకోకముందే.. మరో రెండు..

మంగళసూత్రం లాక్కెళ్లడంతో రాయగిరిలో శిరీష అనే మహిళ మెడపై గాయమైన దృశ్యం

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: భువనగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాయగిరిలో ఇంటి డాబాపై నిద్రిస్తున్న మహిళ వద్ద బంగారు పుస్తెల తాడు, ఆమె పక్కనే నిద్రిస్తున్న మరో మహిళ వద్ద గిల్టు బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన మద్దూరి శిరీష గ్రామంలో జరిగిన దుర్గమ్మ పండుగకు తన బంధువులైన మద్దూరి రవీందర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. పండుగ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ ఇంటి డాబాపై నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు నిద్రిస్తున్న శిరీష మెడ నుంచి రెండు తులాల బంగారు పుస్తెల తాడును కత్తిరించుకొని వెళుతూ ఆమె పక్కనే నిద్రిస్తున్న కొమ్ము మాధవి మెడ నుంచి గిల్టు నగలును లాక్కొని వెళ్లే ప్రయత్నం చేయగా గట్టిగా కేకలు వేయడంతో బంధువులందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు. అప్పటికే దుండగుడు పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, గ్రామీణ సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని