logo

పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా..!

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోలింగ్‌ శాతం పెంచేందుకు క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన, ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించగా..

Published : 16 Apr 2024 03:15 IST

మిర్యాలగూడలో ఓటరు అవగాహన సదస్సులో మాట్లాడుతున్న స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారి ప్రేమ్‌కరణ్‌రెడ్డి (పాత చిత్రం)

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోలింగ్‌ శాతం పెంచేందుకు క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన, ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించగా.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. స్వీప్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాల ద్వారా పలు కళాశాలల్లో యువతను చైతన్యపరిచేలా ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు.

తీసుకుంటున్న చర్యలు...

స్వీప్‌ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించి.. తరచూ ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో 40 శాతం కంటే తక్కువగా పోలింగ్‌ నమోదైన కేంద్రాలపై దృష్టి సారించి.. అందుకు గల కారణాలు విశ్లేషించడంతో పాటు అక్కడి ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. పోలింగ్‌ రోజు ప్రైవేట్‌ కార్యాలయాలు, పరిశ్రమలకు విధిగా సెలవు ప్రకటించి.. ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలతో పాటు ఊరూరా ఈవీఎం యంత్రాల పనితీరును వివరించనున్నారు. పోలింగ్‌ శాతం తక్కువగా నమోదయ్యే పట్టణ ప్రాంతాల్లో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల వివరాలు ఇలా ..

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో 74.07శాతం, భువనగిరి నియోజకవర్గంలో 74.39శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 15,85,980 మంది ఓటర్లు ఉండగా..11,74,750 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అత్యధికంగా కోదాడలో 78.01శాతం పోలింగ్‌ నమోదు కాగా.. దేవరకొండలో అతి తక్కువగా 68.77శాతం పోలింగ్‌ నమోదైంది. భువనగిరి లోక్‌సభ పరిధిలో 2019 ఎన్నికల్లో మొత్తం 16,28,033 మంది ఓటర్లు ఉండగా.. 12,11,256 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 81.79శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఇబ్రహీంపట్నంలో అతి తక్కువగా 66.90శాతం పోలింగ్‌ నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని