logo

ఏ శాఖ చూసినా.. అనిశాకు పని పడేలా..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ కొలువును అడ్డుపెట్టుకొని ఆదాయానికి మించి ఆస్తులు పోగేస్తున్న పలువురు అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) దృష్టి సారించింది.

Published : 16 Apr 2024 03:18 IST

  • మిర్యాలగూడలోని నూకల వెంకట్‌రెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో మెడికల్‌ దుకాణం అనుమతి కోసం రూ.18 వేలు లంచం తీసుకుంటుండగా డ్రగ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ సోమేశ్వర్‌ సోమవారం అనిశాకు చిక్కారు.

  • నల్గొండలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అత్యవసర మందుల ఏజెన్సీని కొనసాగించడానికి సదరు నిర్వాహకుడి వద్ద రూ.3 లక్షలు తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఆసుపత్రి పర్యవేక్షకుడు లావిడి లచ్చునాయక్‌ అవినీతి నిరోధక శాఖ వలలో పడ్డారు.

  • గడిచిన మూడు నెలల్లోనే ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఏడుగురు అధికారులు అనిశాకు చిక్కడం గమనార్హం. ఇందులో యాదాద్రి జిల్లా రవాణా శాఖ అధికారితో పాటూ మోత్కూరు మండలం పొడిచేడులో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి వరకు ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

 ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, నల్గొండ నేరవిభాగం : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ కొలువును అడ్డుపెట్టుకొని ఆదాయానికి మించి ఆస్తులు పోగేస్తున్న పలువురు అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) దృష్టి సారించింది. అందులో భాగంగా బాధితుల నుంచి ఫిర్యాదు రావడమే ఆలస్యం...వలపన్ని అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఒకప్పుడు రెవెన్యూ, పోలీసు శాఖలకే పరిమితమైన అవినీతి తిమింగళాలు ప్రస్తుతం అన్ని విభాగాల్లో శాఖోపశాఖలుగా విస్తరించారు. ప్రతి పనికి ఎంతో కొంత ముట్టజెప్పందే సర్కారు కార్యాలయాల్లో పని జరగడం లేదు. ప్రధానంగా పంచాయతీరాజ్‌, విద్యుత్‌, రిజిస్త్ట్రేషన్‌, వ్యవసాయ, పురపాలిక, రవాణా, ఆబ్కారీ, నీటిపారుదల శాఖల్లో ఎక్కువగా అవినీతి జరుగుతోందని అనిశా అధ్యయనంలో తేలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది మే నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 మంది అధికారులు అనిశా వలకు చిక్కడం గమనార్హం. ఇందులో ఎక్కువగా పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖకు చెందిన వారు ఉన్నారు.

మరికొందరిపైనా దృష్టి

గత నాలుగైదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు, ఆబ్కారీ శాఖకు చెందిన నలుగురు అధికారులపై ఇటీవలే అనిశాకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఆబ్కారీ శాఖలో పనిచేస్తూ గత ప్రభుత్వ హయాం నుంచి విచ్చలవిడిగా తన అనుచరులు, అస్మదీయులతో బార్లు నడిపిస్తున్న ఓ రాష్ట్ర స్థాయి అధికారిపైనా ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడంతో.. త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా రవాణా, ఆబ్కారీ, విద్యుత్‌ శాఖల్లోని పలువురు కింది స్థాయి సిబ్బందిపైనా ఇటీవల ఫిర్యాదులు అందడంతో వీరిపై అనిశా కొన్ని రోజుల నుంచే దృష్టి సారించినట్లు తెలిసింది. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న పలువురు విద్యుత్‌ సిబ్బంది, అధికారులు బినామీ గుత్తేదారులుగా చాలా కాలం నుంచి రూ. కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. కొన్ని పనులు చేయకున్నా ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఏకంగా ప్రభుత్వ పెద్దలకే అందడంతో వీరిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ డీఈ స్థాయి అధికారి సొంత శాఖలోని అధికారుల నుంచే రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కడం విశేషం.


  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికారుల నుంచి మండల అధికారి వరకు మొత్తం 12 మందిపై అనిశా ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు  సేకరిస్తుందని..వీరిందరిపైనా హైదరాబాద్‌ స్థాయిలో ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో సమగ్ర వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనిశా దృష్టిలో ఉన్నామని తెలిసిన పలువురు అధికారులు ఇప్పటి నుంచే హైదరాబాద్‌ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టినట్లు తెలిసింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలు రాజధానికి దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. చౌటుప్పల్‌, భువనగిరి, దేవరకొండ రెవెన్యూ డివిజన్లలోని పలు మండలాల రెవెన్యూ అధికారులపైనా అనిశా దృష్టి సారించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని