logo

ఓటు బాణం సంధించు.. రామరాజ్యం స్థాపించు!

ఈ లోకంలో సద్గుణ సంపన్నుడు ఎవరని నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నించినప్పుడు 16 గుణాలు కలిగిన పరిపూర్ణుడు శ్రీరామచంద్రమూర్తే అన్నాడట. శ్రీరాముడు మానవుడిగా పుట్టి పెరిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

Updated : 17 Apr 2024 06:34 IST

మేళ్లచెరువు, మఠంపల్లి, న్యూస్‌టుడే: ఈ లోకంలో సద్గుణ సంపన్నుడు ఎవరని నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నించినప్పుడు 16 గుణాలు కలిగిన పరిపూర్ణుడు శ్రీరామచంద్రమూర్తే అన్నాడట. శ్రీరాముడు మానవుడిగా పుట్టి పెరిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రామరాజ్య స్థాపనలో మరెన్నో ఘట్టాలను చవిచూశాడు. శుత్రువులనూ తన పరాక్రమ శక్తితో సంహరించాడు. సద్గుణాలతో గురువులను మెప్పించాడు. సత్యం, ధర్మం బాటలోనే విజయ సాధన, జనరంజక పాలన అందించాడు. అంతిమంగా రామరాజ్యంలో అందరి మన్ననలు అందుకున్నాడు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ రామరాజ్యం స్థాపనకు ఓటరు నడుం బిగించాలి. ఓటు అనే వజ్రాయుధాన్ని రామబాణంలా సంధించాలి. రాముడి గుణగణాలున్న నేతల్ని ఎన్నుకోవాలి.  

కృతజ్ఞతా భావం..

జటాయువు అనే పక్షి శ్రీరాముడికి సీతాదేవి జాడ తెలిపిందని దాన్ని రావణుడు సంహరిస్తాడు. చనిపోయింది చిన్న పక్షే కదా.. అని రాముడు పక్షిని వదిలేయలేదు. దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తాడు. పక్షి చేసిన సాయానికి కృతజ్ఞత తీర్చుకుంటాడు. నేటి నేతలూ ఓటరును చిన్నవారిగా చూడొద్దు. వారు చేసే ఓటు అనే సాయానికి కృతజ్ఞతగా సంక్షేమాన్ని అందించాలి. ఇలాంటి గుణమున్న నేతవైపే ఓటరు చూపుండాలి.

ప్రజాపాలన తత్పరుడు..

ప్రజా పాలనలో రాముడు తన కుటుంబం కోసం ఏమీ ఆశించడు. ప్రజా సంక్షేమమనే ఏకైక నిర్ణయంపైనే దృష్టి సారించాడు. సత్యం, ధర్మం అనే పాదాలపైనే నడిచే తన రాజ్యంలో ఎవరి మనసునీ నొప్పించని దయాగుణ స్వభావి ఆయన. ప్రజా సంక్షేమమే పరమావధిగా రాజ్య ఉపాసన (దీక్ష) చేసిన మహామనిషి రాముడు. నేటి ప్రజాస్వామ్యంలోనూ ప్రజలే అంతిమ తీర్పరులుగా భావించే అలాంటి నేతలనే ఎన్నుకోవాలి.


క్షమాగుణం..

ధర్మ పాలనలో శ్రీరాముడి క్షమాగుణం అనిర్వచనీయం. తమ రాజ్యంలో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులకు నువ్వే కారణమంటూ తండ్రి దశరథుడు కైకేయిని నిందిస్తుండగా, తనూ తన తల్లిలాంటిదేనని, అలా అనొద్దని ఆమెపై క్షమాగుణాన్ని ప్రదర్శిస్తాడు రాముడు. ఈ కాలంలోనూ రాముడిలాంటి క్షమాగుణం గల వారిని ఎన్నుకునే బాధ్యత ఓటర్లదేనని మరవొద్దు.


శాంతి స్థాపనకే ప్రాధాన్యం..

రామరాజ్యంలో శాంతి స్థాపనకే ప్రాధాన్యం ఉండేది. అల్లర్లు, దోపిడీలకు ఆస్కారం లేదు. ఇలాంటి ఈ దుష్టాంతాలను వినడానికే ఇష్టపడని వ్యక్తిత్వం రాముడిది. అందుకే శాంతి కాముకుడిగా నిలిచాడు. నేటి పాలకుల ఇలాకాల్లో నిత్యం ఘర్షణలు, భూ దోపిడీలు సాగుతూనే ఉన్నాయి. వాటిని ప్రోత్సహించే వారే ఎక్కువయ్యారు. నిరోధించడంలో రామగుణం గల వారే కావాలని కోరుకోవాలి.


పితృవాక్య పరిపాలకుడు..

తండ్రి మాట జవదాటని వాడంటే శ్రీరాముడినే చూపుతారు. ఆయన మాటకు విలువిచ్చి సంక్షేమ రాజ్యమంటే రామరాజ్యమని నిరూపించాడు. నేటి నేతలు పితృ సమానులుగా పెద్దలను భావించాలి. అలా పరిపాలన అందించే గుణం గల వారినే ఎన్నుకునేంత విచక్షణ ఓటర్లలో రావాలి. ఈ బాధ్యత ఓటర్లదే.


నిర్మల హృదయం..

ప్రతి పండునూ రుచి చూసి తనకిచ్చిన శబరిపై రాముడు ఆగ్రహించలేదు. ఆమెకు మోక్షాన్నే ప్రసాదిస్తాడు. ఆమెపై ఎంగిలి అనే కోపమే ప్రదర్శించని నిర్మల హృదయం ఆయనిది. నేటి నేతల్లోనూ నిర్మల హృదయం గలవారి కోసం ఓటర్లు అన్వేషించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని