logo

అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!

ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్‌ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

Published : 24 Apr 2024 02:23 IST

కలెక్టరేట్‌లో కేంద్ర మంత్రి జైశంకర్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి,

పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లుతో కలిసి రిటర్నింగ్‌ అధికారి హన్మంత్‌ కె. జెండగేకు

మరో సెట్టు నామపత్రం సమర్పిస్తున్న భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌

భువనగిరి, న్యూస్‌టుడే: ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్‌ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్‌ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. భువనగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ నామినేషన్‌ పురస్కరించుకుని మంగళవారం అట్టహాసంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక వినాయక చౌరస్తాలో రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ముస్లింల ఓట్ల కోసం మజ్లిస్‌ పార్టీకి రేవంత్‌రెడ్డి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఆయా పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. డాక్టర్‌గా వృత్తిలో రాణిస్తూ, మాజీ ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధికి సేవలు అందించిన డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ను లోక్‌సభకు పంపి మోదీని తిరిగి ప్రధాని చేయాలన్నారు. భాజపా శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..ఓటమి తప్పదన్న నిఘా వర్గాల హెచ్చరికతో ఉలిక్కిపడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాజపాపై విమర్శలు చేస్తున్నారన్నారు. భువనగిరిలో కూడా ఓటమి తప్పదని గ్రహించి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి పరుగులు తీసి పొగడ్తలతో ముంచుతున్నాడన్నారు. అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. ధనం, అధికార అహంకారంతో తనను ఓడించేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ కుట్రచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరేస్తామన్నారు.

అభ్యర్థి నర్సయ్యగౌడ్‌ ఒక సెట్టు నామినేషన్‌ వేసినా.. భాజపా శ్రేణులు వెంటరాగా మరో సెట్టు నామపత్రాన్ని కేంద్ర మంత్రి జైశంకర్‌, డాక్టర్‌ లక్ష్మణ్‌, మహేశ్వరెడ్డితో కలిసి వేశారు. హైదరాబాద్‌ చౌరస్తా నుంచి భారీ ర్యాలీలో కోలాహాలంగా నామినేషన్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకులు జి.మనోహర్‌రెడ్డి, చీకోటి ప్రవీణ్‌, జిల్లా నాయకులు దాసరి మల్లేశం, పీఎస్‌ రవీందర్‌, జనగాం, నల్గొండ, భువనగిరి జిల్లా అధ్యక్షులు దశరథరెడ్డి, వర్షిత్‌రెడ్డి, పాశం భాస్కర్‌, నాయకులు చందా మహేందర్‌గుప్తా, ఉట్కూరి అశోక్‌గౌడ్‌, పడాల శ్రీనివాస్‌, ఎన్నం శివకుమార్‌, నార్లకంటి మొగిలయ్య, జగన్మోహన్‌రెడ్డి, మాయ దశరథ, రత్నపురం బలరాం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని