logo

బడికి నిధులు

యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు.

Published : 24 Apr 2024 02:24 IST

కొలనుపాకలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

ఆలేరు, న్యూస్‌టుడే: యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తి కావొచ్చింది. జిల్లాలో 712 పాఠశాలలు ఉండగా గతంలో 251 పాఠశాలల్లో మన ఊరు-మనబడి ప్రణాళికలో వివిధ పనులు చేపట్టారు. సుమారు 150 పాఠశాలల్లో పనులు చేపట్టగా మిగతా 101 పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు మౌలిక వసతులకు నోచుకోని పాఠశాలలు 583 ఉన్నట్లుగా గుర్తించారు.

చేపట్టనున్న పనులు..

ప్రధానంగా మరుగుదొడ్లు, బాలికల మూత్రశాలలు, విద్యుత్తు, తాగునీరు, తరగతి గదుల మరమ్మతులు చేపడతారు. మొదటి విడతగా మౌలిక వసతుల కల్పన, స్కూల్‌ యూనిఫాం కుట్టుకూలీ కోసం 25 శాతం నిధులు మంజూరు చేస్తారు. పాఠశాలలకు మంజూరైన నిధులను మొదటగా ఎంపీడీవోల ఖాతాల్లో జమ కానున్నాయి. పాఠశాలల్లో గరిష్ఠంగా రూ.14 లక్షలు, కనిష్ఠంగా రూ.1.35 లక్షలతో పనులు గుర్తించారు. అమ్మ ఆదర్శ కమిటీల తీర్మానం మేరకు పనులు చేపట్టనున్నారు.

నిధుల డ్రా ఇలా..

పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతుల పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. రూ.25వేల విలువైన పనులు చేపట్టిన అనంతరం అమ్మ ఆదర్శ కమిటీలు సమావేశమై నిధులను బ్యాంకు నుంచి తీయాల్సి ఉంటుంది. రూ.లక్ష వరకు అయితే ఎంపీడీవో అనుమతితో బ్యాంకు ఖాతా నుంచి తీయాల్సి ఉంటుంది. లక్ష రూపాయలకు పైబడి విలువైన పనులను చేపడితే జిల్లా మహిళా సమాఖ్యతో పాటు, జిల్లా ఉన్నతాధికారి అనుమతితో నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది.

త్వరలో ప్రారంభిస్తాం
నారాయణరెడ్డి, డీఈవో, యాదాద్రి భువనగిరి

పాఠశాలల్లో అవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాదనలు పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రాంభమవుతాయి. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమ్మ ఆదర్శ కమిటీలతో చేపట్టనున్న పనులు పూర్తయితే పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు సమకూరుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని