logo

మాటలే తూటాలై..!

‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు.

Updated : 24 Apr 2024 06:11 IST

‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డికి 80 ఎకరాల ఫాంహౌస్‌, వందల కోట్లు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలి. కేసీఆర్‌, జగదీశ్‌రెడ్డి కలిసి నల్గొండ జిల్లాను నాశనం చేశారు.’

మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


ఇక్కడున్న ఒక మంత్రి రైతుబంధు అడిగితే రైతులను దుర్భాషలాడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం. సీఎం రేవంత్‌, మంత్రులు ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టడం తప్పితే ఏం చేయడం లేదు. సాగర్‌ నీళ్లను ఏపీ తరలించుకుపోతే ఉమ్మడి జిల్లా మంత్రులు ఏం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.’

నామినేషన్‌ ర్యాలీలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి


ఈనాడు, నల్గొండ : లోక్‌సభ ఎన్నికల్లో కీలకపర్వమైన నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుతున్న వేళ.. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష భారాస మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరుతోంది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారాసతో పాటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగదీశ్‌రెడ్డి ఇద్దరు మంత్రులతో పాటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల భువనగిరిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌ సైతం మాజీ మంత్రిపై పలు విమర్శలు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మంత్రులు, మాజీ మంత్రి మధ్య రాజకీయంగా మారింది.

అధికార పార్టీ నుంచి నల్గొండ లోక్‌సభకు మంత్రి ఉత్తమ్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా..భువనగిరికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సమన్వయకర్తగా ఉన్నారు. ప్రతిపక్ష భారాస నుంచి రెండు లోక్‌సభ స్థానాలకు జగదీశ్‌రెడ్డియే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం, మంత్రులపై భారాస ప్రధానంగా సాగర్‌ నుంచి ఏపీ నీటి తరలింపుతో పాటూ రైతుల కరవు, కష్టాల గురించి విమర్శలు చేస్తుండగా.. పదేళ్ల పాలనలో జిల్లాను నాశనం చేశారని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

కేసీఆర్‌ రాకతో పెరగనున్న వే‘ఢీ’

మిర్యాలగూడలో నేడు మాజీ సీఎం కేసీఆర్‌ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ నుంచి బస్సులో చౌటుప్పల్‌, చిట్యాల, నల్గొండ మీదుగా మిర్యాలగూడ చేరుకోనున్న మాజీ సీఎం సాయంత్రం మిర్యాలగూడ, అనంతరం సూర్యాపేటలో రోడ్‌షో చేయనున్నారు. ఈ యాత్రలో భారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొనేలా భారాస ఏర్పాట్లు చేస్తోంది. లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల నుంచి రెండు ప్రాంతాల్లో పాల్గొనేలా జనసమీకరణ చేస్తున్నారు. మరోవైపు ఇదే రోజు నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా కాంగ్రెస్‌ మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డితో పాటూ జానారెడ్డి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ సైతం భారీ ఏర్పాట్లు చేస్తోంది. భారీ జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో యాత్ర సందర్భంగా కేసీఆర్‌ ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది. రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో భాజపా సైతం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా కేంద్ర మంత్రులు హాజరుకాగా.. త్వరలోనే కేంద్ర పథకాలు, మోదీ మేనియాతో ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలని భావిస్తోంది. మొత్తంగా పోలింగుకు మరో 20 రోజులు ఉండగానే మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని