logo

కార్మికులకు కలిసొచ్చే కాలమే..!

‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు.

Updated : 30 Apr 2024 06:22 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: ‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహానికి దగ్గరగా వచ్చినపుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. ఈ కాలాన్ని ఏవైనా పనులు ప్రారంభించడానికి అశుభంగా భావిస్తూ వాయిదా వేస్తుంటారు. ఏప్రిల్‌ నెల 27 నుంచి ఆగస్టు 8 వరకు ‘మూఢం’ ఉంటుందని పండితులు చెబుతున్నారు. కానీ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లోక్‌సభ ఎన్నిక ఇదే సమయంలో వచ్చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా అరంగేట్రం చేసి రాజకీయ భవిష్యత్తు పరీక్షించుకునే యువ నాయకులు, గత రాజకీయ భవిష్యత్తును గణనీయంగా కోల్పోయిన అగ్రజులు, పాత పార్టీలో ఇమడలేక పార్టీలు మార్చే నేతలకు ఈ కాలం కలిసొచ్చేనా అనే సందేహాలు వేధిస్తున్నాయి.  

శుభకార్యాలకు విరామం.. ప్రచారం ఆరంభం

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశావహ నేతలందరూ ఓట్ల కోసం తమ అభిమానులు, అనుచరులకు సంబంధించి అన్ని శుభకార్యాలకూ హాజరవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ‘మూఢం’ రావడంతో వాటికి బ్రేక్‌ పడింది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచారం, ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు, తదితర జనసమ్మర్ధ కార్యక్రమాల్లోనే ఓటర్లను మూకుమ్మడిగా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఓటరు మహాశయులను కలవాలంటే శుభకార్యాలకు బదులుగా పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే ఆత్మీయ సమ్మేళనాలవంటి సందర్భాలు సృష్టించుకోవాల్సిందే.

  • మే 13న లోక్‌సభ ఎన్నికలు, ఆ వెంటనే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు ఎన్నికలు జరగనుండటంతో శుభకార్యాలకు అడ్డొచ్చిన ‘మూఢం’ కాస్తా.. కష్టం చేసుకునే కార్మికులకు కలిసొచ్చేలా ఉంది. శుభకార్యాలకు పనిచేసే వృత్తుల వారికి ఈ ఎన్నికలతో ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా వివిధ పార్టీల ప్రచారం కోసం, టిఫిన్లు, భోజనాల తయారుతో పాటు విజయోత్సవాల నిర్వహణ వంటి కార్యక్రమాలకు ఎంతో మంది కూలీల అవసరం ఉంటుంది. నాయకుడు ఊరేగింపులో మేళతాళాలు వాయించే వారి నుంచి డీజే, లైటింగ్‌, జెండాలు పట్టే వారు, నృత్యాలు, కోలాటాలు, బ్యానర్లు కట్టే వారు, జెండాలు మోసే వారు, వంటా వార్పు, వడ్డింపులు, కూలీలు ఇలా అన్ని రంగాల్లో పని చేసే కార్మికులకు పని చూపదనుకున్న ఈ ‘మూఢం’ కాస్త ఎన్నికల పుణ్యమాని ఊరటనివ్వనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని