logo

పోటెత్తాలి.. పౌరుడా..!

మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం.

Published : 30 Apr 2024 05:23 IST

పోలింగ్‌ శాతం పెంపునకు అధికారుల కసరత్తు  

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. చరవాణి, సినిమా, ఒకటేమిటి సామాజిక మాధ్యమాలైన వాట్సప్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ఖాతాను, టెలిగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాలను విరివిగా చూసేస్తూ లైక్‌లు ఇచ్చుకుంటూ తెగ సంబర పడిపోతుంటాం. అయితే భావితరాలకు శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే ‘ఓటు హక్కు’ వినియోగంపై నిర్లక్ష్యం వహిస్తుంటాం. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా అక్షరజ్ఞానం కలిగిన వారే ఓటు హక్కు వినియోగంలో వెనకబడి పోతుండటం విచారకరం. ఐదేళ్లకోసారి వేసే ఓటు వేసే క్రమంపై మాత్రం అనాసక్తి ప్రదర్శిస్తుండటం బాధ్యత అనిపించుకోదని మేధావుల అభిప్రాయం. క్యూలో నిలబడి ఆ కొన్ని గంటల సమయాన్ని వెచ్చించి భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటుహక్కును సద్వినియోగ పరచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

తాజాగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్‌ సరళి ఇలా..

దేశంలోని ఆయా ప్రాంతాల్లో తొలి, రెండోదశ లోక్‌సభ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. చాలా రాష్ట్రాల్లో 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. కేరళలో 2019లో 77.67 శాతం నమోదవగా, ప్రస్తుతం 65.91 శాతం మాత్రమే నమోదైంది. రాజస్థాన్‌లో 66.34 శాతం గతంలో ఉంటే 64.07 శాతానికి తగ్గింది. తమిళనాడులో 72.44 శాతం నుంచి 69.72 శాతానికి తగ్గింది. కొత్త ఓటర్లు పెరుగుతున్నా ఓట్లేసే వారి సంఖ్య క్రమేణా తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఈ తరహా పరిస్థితులు గత లోక్‌సభ ఎన్నికల్లో చూశాం.

ఓట్లు పెరిగినా..

2014 ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 4,00,560 మంది ఓటు వేయలేదు. అంటే కేవలం 74.10 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. 2019లో 5,05,245 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.  కేవలం 69.84 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గత 2014లో 2,80,308 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. 81.2 శాతంగా పోలింగ్‌ నమోదైంది.  2019 ఎన్నికల్లో 4,15,402 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. 74.48 శాతం పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా యువ ఓటర్లు దూరం ఉన్నట్లుగా సమాచారం. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 1,70,593 ఓటర్లు పెరిగారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలో 43,397 మంది ఓటర్లు పెరగడం విశేషం.  

బాధ్యత గుర్తెరగాలి..

మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. స్వీప్‌ (సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోరల్‌ పార్టిసిపేషన్‌) ఆధ్వర్యంలో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో అధికారులు, విద్యార్థులు కలిసి అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, మహిళా సంఘాలతో ప్రదర్శనలు, ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. కూడళ్లలోనూ, పోలింగ్‌ కేంద్రాల వద్ద, పంచాయతీ కార్యాలయాల వద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీఎల్వోల ద్వారా ఓటరు గైడ్‌ల పంపిణీ కార్యక్రమం చురుకుగా సాగుతుంది. త్వరలోనే ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. వీటితోపాటు క్షేత్రస్థాయిలో పలు రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పుడే ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందుకు యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు విరివిగా ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడితేనే ఫలితం ఉంటుంది. యంత్రాంగం ఎంత చేసినా పౌరుడిగా మన బాధ్యత నెరవేర్చినప్పుడే ఫలితం ఉంటుందన్నది వాస్తవం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని