logo

రూ.7.20 లక్షల ఆర్థిక సాయం అందజేత

చౌటుప్పల్‌లో నివాసముండే కోతులాపురానికి చెందిన ఏనుగు భూపాల్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు.

Updated : 01 May 2024 06:34 IST

చెక్కును అందిస్తున్న ప్రవాస భారతీయుడు వంశీధర్‌రెడ్డి, మిత్రులు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: చౌటుప్పల్‌లో నివాసముండే కోతులాపురానికి చెందిన ఏనుగు భూపాల్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు. ఇద్దరు కుమారులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డిల చదువు ఆగిపోయే పరిస్థితి ఉందని ‘దాతలు స్పందించాలి..చేయూత అందించాలి’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో 2023 సెప్టెంబరు 27న కథనం ప్రచురితమైంది. కథనానికి అమెరికాలోని డల్లాస్‌లో నివాసముండే ప్రవాస భారతీయులు వంశీధర్‌రెడ్డి, కోడూరు కృష్ణారెడ్డిలు స్పందించారు. హైదరాబాద్‌ నివాసి కేవీరెడ్డి సహకారంతో గుడిమల్కాపురానికి చెందిన మన్నె నర్సింహారెడ్డి అందించిన వివరాలతో ‘గో ఫండ్‌ మీ’ సంస్థ ద్వారా రూ.3,53,000 విరాళాలు సేకరించారు. ఆ చెక్కును వరంగల్‌ ఎన్‌ఐటీలో విద్యాభ్యాసం చేస్తున్న ఏనుగు రాంరెడ్డికి సోమవారం అందజేశారు. సోదరులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డిల ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసేందుకు ఈ డబ్బు వినియోగించాలని, భవిష్యత్తులో వారి చదువుకు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు ‘ఈనాడు’లో కథనానికి స్పందించిన పలువురు దాతలు తమకు తోచినంత ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా పంపిన ఆర్థిక సహాయం రూ.3,67,000 పోగయింది. ఈ డబ్బును పిల్లల చదువులు నిల్చిపోకుండా భూపాల్‌రెడ్డి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డిలు ఒకరు వరంగల్‌, మరొకరు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ‘ఎన్‌ఐటీ’ల్లో సీట్లు సాధించారు. డబ్బులేక చదువు ఆగిపోయి.. భవిష్యత్తు అంధకారం అవుతుందేమోనని కుమిలిపోతున్న సమయంలో దాతలు అందించిన రూ.7.20 లక్షలు ఆర్థిక సాయంతో నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేస్తామనే భరోసా ఏర్పడిందని, దాతలకు, ‘ఈనాడు’కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని