logo

నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్‌

ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్‌ (బ్యాలెట్‌ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్‌) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.

Published : 05 May 2024 04:29 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్‌ (బ్యాలెట్‌ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్‌) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈసీఐఎల్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు, వారి ఏజెంట్ల ఆధ్వర్యంలో కమీషనింగ్‌ ప్రక్రియ చేపడతారు. ఈ ప్రక్రియ ఆది, సోమవారాల్లో కొనసాగనుంది. ఈవీఎంలో భాగాలైన బ్యాలెట్‌ యూనిట్‌కు 4, కంట్రోల్‌ యూనిట్‌కు 3, వీవీ ప్యాట్‌కు 3 చొప్పున పోలింగ్‌ కేంద్రం చిరునామా ట్యాగులను అమర్చడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

యంత్రాలు సిద్ధం..

కమీషనింగ్‌ ప్రక్రియలో భాగంగా ఈసీఐఎల్‌ ఇంజినీర్లు వీవీ ప్యాట్‌లో బ్యాటరీ, పేపర్‌ రోల్‌ అమర్చి గుర్తులను లోడ్‌ చేస్తారు. అనంతరం ప్రింట్‌ను ఎన్నికల అధికారులు, సహాయ అధికారులు పరిశీలిస్తారు. దీని తర్వాత బ్యాలెట్‌ యూనిట్‌లోని పరికరాలన్నీ అసలైనవేనని ఇంజినీర్లు నిర్ధారిస్తారు. ప్రతి బ్యాలెట్‌ కాగితం వెనుక వైపు ఆర్వో సంతకం చేసి బ్యాలెట్‌ యూనిట్‌లోని తెరను తెరచి జాగ్రత్తగా కాగితాన్ని అమర్చుతారు. అనంతరం వాటికి సీల్‌ వేస్తారు. దీని తర్వాత కంట్రోల్‌ యూనిట్‌లోనూ బ్యాటరీని అమర్చుతారు.

ఒక్కొక్కరికి ఒక్కో ఓటు..

అనంతరం కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లను సక్రమంగా అనుసంధానం చేస్తారు. కంట్రోల్‌ యూనిట్‌ స్విచ్‌ ఆన్‌ చేసి.. నమూనా పోలింగ్‌కు సిద్ధం చేస్తారు. నమూనా పోలింగ్‌లో భాగంగా ప్రతి అభ్యర్థితో పాటు నోటాకు సైతం ఒక ఓటు చొప్పున వేస్తారు. అనంతరం సీయూ, వీవీ ప్యాట్‌లోని ఫలితాలను పోల్చి చూస్తారు. అనంతరం నమూనా పోలింగ్‌ డాటాను, వీవీ ప్యాట్‌లోని చిట్టీలను తొలగిస్తారు. కంట్రోల్‌ యూనిట్‌ను స్వీచ్‌ ఆఫ్‌ చేసి.. పేపర్‌ రోల్‌ను లాక్‌ చేసి.. వీవీ ప్యాట్‌తో అనుసంధానాన్ని తొలగిస్తారు.

అధిక మొత్తంలో నమూనా పోలింగ్‌..

అన్ని యంత్రాలను చిరునామా ట్యాగ్‌లతో సీల్‌ చేసి.. మొత్తం ఈవీఎంలలోని యంత్రాలలో వెయ్యి ఓట్లతో నమూనా పోలింగ్‌ కోసం యాధృచ్ఛికంగా 5 శాతం యంత్రాలను ఎంపిక చేస్తారు. వాటిలోని కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ల నుంచి నమూనా పోలింగ్‌ డాటాను తొలగిస్తారు. మళ్లీ కొత్తగా బ్యాటరీలు, పేపర్‌ రోల్‌లు అమర్చి.. వెయ్యి ఓట్లతో అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్‌ నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని