logo

జనన, మరణ ధ్రువపత్రాల జారీ సులువే

జనన, మరణ ధ్రువపత్రాల కోసం పట్టణవాసుల ఇక్కట్లు దూరమయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే అందించేలా గతంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తోంది.

Updated : 06 May 2024 05:53 IST

ఆలేరు పురపాలిక నుంచి నూతన విధానంలో జారీ అయిన జనన ధ్రువ పత్రం

ఆలేరు, న్యూస్‌టుడే: జనన, మరణ ధ్రువపత్రాల కోసం పట్టణవాసుల ఇక్కట్లు దూరమయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే అందించేలా గతంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తోంది. పత్రాలు పొందేందుకు పురపాలికల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒక్క రోజులోనే ఆయా పత్రాలను మీసేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు. జనన, మరణ ధ్రువపత్రాల జారీకి ఉమ్మడి జిల్లాలోని 500 ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులను ఎంపిక చేసింది. వీటికి రాష్ట్ర పురపాలక పరిపాలనా విభాగం వేర్వేరు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డులు ఇచ్చింది. దీంతో పాటు 400లకు పైగా హిందూ, ముస్లిమ్‌, క్రైస్తవ శ్మశాన వాటికల నిర్వాహకులు, కాటికాపర్లను గుర్తించి ప్రత్యేక యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌లను అందజేశారు. 2022 మార్చిలో ప్రారంభమైన ఈ విధానంలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో సుమారు 10 వేలకు పైగా జనన, మరణ ధ్రువపత్రాలు జారీ అయ్యాయి.

జనన ధ్రువపత్రం ఇలా..

ఆసుపత్రులలో శిశువులు జన్మించిన 24 గంటల వ్యవధిలో ఆసుపత్రుల అధికారులు, నిర్వాహకులు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ల ద్వారా శిశువు, తల్లిదండ్రుల వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. ఆ వెంటనే సంబంధిత చరవాణికి సంక్షిప్త సందేశం, లింక్‌ వస్తుంది. లింక్‌ను క్లిక్‌ చేస్తే తాత్కాలిక జనన ధ్రువపత్రం ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు. పుట్టిన శిశువు ఏడాది లోపు పేరుపెట్టిన అనంతరం తిరిగి ఆ లింక్‌లోనే పేరుతో సహా అవసరమై వివరాలను అప్‌లోడ్‌ చేసి తిరిగి పూర్తిస్థాయి జనన ధ్రువపత్రం పొందవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ఇంటివద్ద, ఇతర ప్రాంతాల్లో సాధారణ కాన్పులు జరిగితే ఇతర చికిత్సల కోసం వెళ్లిన ఆసుపత్రుల ద్వారా జనన వివరాలను అప్‌ లోడ్‌ చేసి జనన ధ్రువపత్రాల పొందవచ్చు.

ప్రత్యేక యాప్‌..

మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో శ్మశానవాటికల నిర్వాహకులు లేదా కాటికాపరుల బాధ్యతలు కీలకంగా మారాయి. అంత్యక్రియల సమయంలో శ్మశాన వాటికకు తీసుకువచ్చే మృతదేహాల వివరాలను శ్మశానవాటికల నిర్వాహకులు లేదా కాటికాపరులు తమకు మున్సిపల్‌ పరిపాలనా విభాగం అందజేసిన స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ వెంటనే సంబంధితుల సెల్‌ఫోన్‌కు మెస్సేజ్‌, లింక్‌ వస్తుంది. లింక్‌పైక్లిక్‌ చేసి మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్ట్‌మార్టం పూర్తి కాగానే ప్రత్యేసైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని