logo

ఎంపీలకు ఎన్ని సౌకర్యాలో..!

ఒకసారి ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తే ప్రభుత్వ పరంగా జీతభత్యాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తారు. అలాంటి సీటులో కూర్చునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.

Published : 06 May 2024 07:58 IST

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఒకసారి ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తే ప్రభుత్వ పరంగా జీతభత్యాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తారు. అలాంటి సీటులో కూర్చునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.

  • నెలకు రూ.లక్ష వేతనం (అన్ని అలవెన్సులతో కలిపి) లభిస్తుంది. పదవి అనంతరం రూ.50 వేల నుంచి అత్యధికంగా రూ.70వేల వరకు పింఛన్‌ వస్తుంది.
  • ఎంపీ నిధుల కింద ఏడాదికి రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇవి జిల్లా కలెక్టరుకు వస్తాయి. ఎంపీ గుర్తించిన పనులకు వాటిని ఖర్చు చేస్తారు. నియోజకవర్గంలో ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి పనులకు వీటిని కేటాయిస్తుంటారు. ఎంపీ సిఫార్సు మేరకు ఆయా నిధులను మంజూరు చేయడం, ఆయా పనులు చేయించడం జిల్లా యంత్రాంగం చూసుకుంటుంది.
  • నియోజకవర్గ కార్యాలయ నిర్వహణ ఖర్చు నెలకు రూ.45 వేలు (ఇందులో రూ.15 వేలు స్టేషనరీ, పోస్టేజీకి, రూ.30 వేలు సహాయ సిబ్బంది, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు). పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2 వేలు అదనంగా చెల్లిస్తారు.
  • ఏడాదికి 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం. ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి లేదా మరొకరికి అవకాశం ఉంటుంది. వీరు ఎంపీని కలిసేందుకు ఎనిమిది సార్లు ఒంటరిగానూ ప్రయాణించే అవకాశం కల్పించారు.
  • రైలు ప్రయాణం ఉచితం. ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు. జీవిత భాగస్వామికీ అవకాశం ఉంది.
  • రహదారి మీదుగా ప్రయాణిస్తే కిలోమీటరుకు రూ.16 చొప్పున బిల్లు ఇస్తారు. బస్సులోనూ వీరికి ప్రత్యేక సీటు కేటాయింపు ఉంటుంది.
  • ఫర్నిచర్‌ కోసం.. ప్రతి మూడు నెలలకు ఒక సోఫా కవర్లు మార్చుకునేందుకు, సీలింగ్‌ అవసరాల నిమిత్తం రూ.60 వేలు, ఎలక్ట్రానిక్‌, ఇతర వస్తువులు సమకూర్చుకునేందుకు రూ.15వేలు ఇస్తారు.
  • ఇవికాక రూ.4 లక్షల వరకు అదనపు వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. వీటిని నెలనెలా వాయిదాల రూపంలో 60 నెలల్లో చెల్లించుకోవచ్చు. వీరి నివాసం వద్ద ఎల్‌పీజీ గ్యాస్‌, గ్రంథాలయ సదుపాయాలు ఉంటాయి.
  • ప్రథమ శ్రేణి అధికారుల కేంద్ర పౌరసేవల కింద కేంద్ర ప్రభుత్వం వైద్యారోగ్య పథకం ద్వారా వైద్యారోగ్య సేవలు(సీజీహెచ్‌ఎస్‌) పొందవచ్చు. ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్‌, ఈసీజీ, పాథలాజికల్‌ లాబొరేటరీ సౌకర్యం, హృద్రోగ, దంత, కంటి, ఈఎన్‌టీ, చర్మ, తదితర ఆరోగ్య సేవలను ఉచితంగా పొందవచ్చు.
  • దిల్లీలో నివాస వసతిని కల్పిస్తారు. మొదటిసారి గెలిచిన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలను కేటాయిస్తారు. దిల్లీలో బీకేఎస్‌ మార్గ్‌లోని ఎంఎస్‌ ప్లాట్‌ను కేటాయిస్తున్నారు. సీనియర్‌ ఎంపీలకు వ్యక్తిగత బంగ్లాను కేటాయిస్తారు. 50 వేల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు.
  • మూడు టెలిఫోన్లు పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. దిల్లీలోని ఇంటి వద్ద, కార్యాలయంలో, రాష్ట్రంలోని నివాసం వద్ద తనకు ఇష్టమైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో 50 వేల కాల్స్‌ ఉచితం. మొబైల్‌ ఫోన్‌ 3జీ ప్యాకేజీతో అదనంగా 1.50 లక్షల కాల్స్‌ మాట్లాడుకునే వీలు ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని