logo

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని దుప్పల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుప్పల్లి గ్రామానికి చెందిన గాదగోని రోశయ్య (45) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Published : 06 May 2024 02:44 IST

గాదగోని రోశయ్య

వలిగొండ, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని దుప్పల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుప్పల్లి గ్రామానికి చెందిన గాదగోని రోశయ్య (45) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామంలో నూతన ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. పిల్లర్ల నిర్మాణ పనులకు కావాల్సిన నీటి కోసం విద్యుత్తు మోటారుకు పైపు తొడిగే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. రోశయ్యకు భార్య లక్ష్మి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. 


కుమారుడు ఉరేసుకున్న స్థలంలోనే తండ్రి బలవన్మరణం

బీబీనగర్‌, న్యూస్‌టుడే: మూడు నెలల క్రితం కొడుకు బలవన్మరణం చెందాడు.. అతన్ని తలచుకుంటూ మనస్తాపం చెందిన తండ్రి కుమారుడు ఉరేేసుకున్న పశువుల పాకలోనే ఉరేేసుకొని బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన ఆదివారం బీబీనగర్‌ మండలం గూడూరులో చోటుచేసుకుంది. బీబీనగర్‌ ఎస్సై రమేష్‌ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరు గ్రామానికి చెందిన జుర్రు రాము, లావణ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు అరుణ్‌తో కలిసి తల్లిదండ్రులు పొలం వద్ద గేదెల షెడ్‌ ఏర్పాటు చేసి అక్కడ పాలవ్యాపారం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పెద్ద కుమారుడు అరుణ్‌(19) టోల్‌ప్లాజా సమీపంలోని వారి పశువుల పాకలో ఉరివేసుకొని చనిపోయాడు. నాటి నుంచి కుమారుడి జ్ఞాపకాలతో తరచూ కన్నీరు పెడుతూ మనస్తాపానికి గురైన తండ్రి జుర్రు రాము(40) ఆదివారం తెల్లవారుజామున అదే పశువులపాకలో కుమారుడు ఉరివేసుకున్న చోటే తానూ ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌, ఎస్సై-2 అమర్‌సింగ్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం రాము అంత్యక్రియల్లో పరిసర ప్రాంత ప్రజలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని