logo

కృష్ణా జలాల వాటాపై పోరాటం

‘బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం కృష్ణాలో రావాల్సిన నీటి వాటా కోసం పోరాడుతా. సాగర్‌ ప్రాజెక్టులో 130 టీఎంసీల నీరున్నా రైతులకు సాగునీళ్లు ఇవ్వలేదు. మా హయాంలో ఉమ్మడి జిల్లాలో 11.5 లక్షల ఎకరాల్లో వరి సాగయితే..

Updated : 06 May 2024 05:51 IST

‘ఈనాడు’తో నల్గొండ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి

ఈనాడు, నల్గొండ : ‘బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం కృష్ణాలో రావాల్సిన నీటి వాటా కోసం పోరాడుతా. సాగర్‌ ప్రాజెక్టులో 130 టీఎంసీల నీరున్నా రైతులకు సాగునీళ్లు ఇవ్వలేదు. మా హయాంలో ఉమ్మడి జిల్లాలో 11.5 లక్షల ఎకరాల్లో వరి సాగయితే.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఎకరాల్లో పంటలను ఎండగొట్టారు. పరిపాలన అనుభవం లేకనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఇబ్బందుల పాలు చేస్తోంద’ని నల్గొండ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. తాను రైతుబిడ్డగా  ప్రజల్లోకి వస్తుంటే,  వారసత్వ రాజకీయాలు, ఇంటికి రెండు ఉద్యోగాలతో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారానికి వస్తున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో తొమ్మిది రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు.

పంటలకు గిట్టుబాటు ధరకు ఉద్యమం

ఉమ్మడి జిల్లాలో పత్తి, వరి పంట పండుతున్నా చాలా వరకు గిట్టుబాటు ధరలు రైతులకు దక్కడం లేదు. నన్ను ఎంపీగా గెలిపిస్తే స్వామినాథన్‌ సిఫార్సుల అమలుకు  లోక్‌సభలో పోరాడుతాను. జాతీయ ఉపాధి హామీ కూలీలు సైతం రాష్ట్రంలో నల్గొండ లోక్‌సభ పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు. వీరిని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మహిళలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పలు పరిశ్రమలను స్థాపించేందుకు ప్రయత్నం చేస్తాను.

రైల్వే సమస్యలను పరిష్కరిస్తాం..

గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించిన వారు రైల్వే సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపించారు. నాకు ఒక్క అవకాశం కల్పిస్తే ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాను. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి మార్గంలో బుల్లెట్‌ రైలుతో పాటూ పలు చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించి పార్లమెంటులో ఈ సమస్యలను లేవనెత్తుతాను.

రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ

లోక్‌సభ పరిధిలో పలు జాతీయ రహదారుల నిర్మాణాలు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్స్‌ వద్ద ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలకు అధికారులతో మాట్లాడి చర్యలు ప్రారంభిస్తాను. నల్గొండ - మల్లేపల్లి రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి జాతీయ రహదారిగా మారుస్తాం.

కొత్త జిల్లాల్లో నవోదయ ఏర్పాటు

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయలేదు. గత సీఎం కేసీఆర్‌ సైతం పలుమార్లు విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరినా భాజపా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్లకెందుకు ఓటేయాలి. గత పదేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 10,300 ఉద్యోగాలిస్తే మా పదేళ్ల పాలనలో 1.92 లక్షల ఉద్యోగాలిచ్చాం. నల్గొండ లోక్‌సభ పరిధిలో కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని రాబట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.

ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి కృషి..

ఆయకట్టులోని మిర్యాలగూడ, సాగర్‌, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో రైస్‌మిల్లులు, సిమెంటు పరిశ్రమలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారందరినీ ఈఎస్‌ఐ పరిధిలో చేర్పించి ఈ ప్రాంతంలో కేంద్రం తరఫున ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తాను. ఏళ్ల నుంచి ఉన్నన ఈ డిమాండ్‌ను గత ఎంపీలు పట్టించుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని