logo

ప్లాస్టిక్‌ ముప్పు.. ఎవరిదీ తప్పు..!

పురపాలికల్లో పాలిథిన్‌ నిషేధం ప్రచారానికే పరిమితం అయింది. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టం, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఉత్తర్వుల ప్రకారం 50 మైక్రాన్లు మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్‌ సంచులను వాడొద్దు.

Updated : 06 May 2024 05:50 IST

నల్గొండలో రోడ్ల పక్కన  వాడి పడేసిన పాలిథిన్‌ సంచులు

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: పురపాలికల్లో పాలిథిన్‌ నిషేధం ప్రచారానికే పరిమితం అయింది. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టం, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఉత్తర్వుల ప్రకారం 50 మైక్రాన్లు మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్‌ సంచులను వాడొద్దు. తెలుపు కవర్లు తప్ప నలుపు, నీలం, ఇతర రంగులను వాడటానికి వీలు లేదు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పురపాలికల్లో కమిషనర్లు పర్యవేక్షిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే నిల్వలను సీజ్‌ చేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్‌ను తగ్గించాలని చెబుతున్నా ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం లేదు. దీంతో జిల్లాలో పాలిథిన్‌ వస్తువుల వాడకం విపరీతంగా  పెరిగిపోతోంది.

అటకెక్కిన పాలిథిన్‌ నిషేధం

పురపాలికల్లో మండల కేంద్రాల్లో నిర్ధిష్ట ప్రమాణాలు లేని ప్లాస్టిక్‌ నిషేధం కథ మొదటికొచ్చింది. పూర్వ నల్గొండ జిల్లా పరిధిలోని 19 పురపాలిక పరిధిలో నిత్యం 320 టన్నులకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతోంది. అందులో 30శాతానికి పైగా పాలిథిన్‌ సంచులు, గ్లాసులు, బాటిల్స్‌ పోగవుతున్నాయి. గత ఏడాది నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ పట్టణాల్లో పాలిథిన్‌ సంచులు వాడే దుకాణాలను సీజ్‌ చేసి రూ.3లక్షలకు పైగా జరిమానా విధించిన విషయం తెలిసిందే. కానీ.. ప్రస్తుతం ప్లాస్టిక్‌ నియంత్రణ కరవైంది. తనిఖీలు, జరిమానా విధించే అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ పురపాలికల్లో నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారు. మిగత 17 పురపాలికల్లో తనిఖీల జోలికి అధికారులు వెళ్లడం లేదు. హైదరాబాద్‌, విజయవాడ కేంద్రాల నుంచి ప్రధాన పట్టణాలకు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రాలకు వ్యాపారులు సరఫరా చేస్తూ కాసులు జేబులు నింపుకొంటున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం..

రంగు రంగుల సంచుల తయారీలో హానీకర రసాయనాలు కలిసిన పాలిథిన్‌ సంచులు వాడటంతో క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. భూమి పొరల్లో సంవత్సరాల కొద్ది ప్లాస్టిక్‌ కరిగిపోకుండా ఉండటం వల్ల నీరు సరిగా ఇంకడం లేదు. వాడి పడేసిన పాలిథిన్‌ వ్యర్థాలతో మురుగు కాల్వలు నిండిపోతున్నాయి. నీరు దిగువకు పారకుండా అడ్డుపడుతున్నాయి. పాలిథిన్‌ విక్రయాలపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించకపోతే స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

నిషేధం అమలయ్యేలా చర్యలు:

ముసాబ్‌ అహ్మద్‌ సయ్యద్‌, కమిషనర్‌, నల్గొండ పురపాలిక

పాలిథిన్‌ నిషేధం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. వ్యాపారులపై ఇటీవలనే రూ.50వేలకు పైగా జరిమానాలు వసూలు చేశాం. ఎన్నికలు పూర్తవ్వగానే పూర్తి స్థాయిలో దాడులు చేస్తూ పాలిథిన్‌ వాడకం, విక్రయాల నియంత్రణ చేపడుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని