logo

పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యం

గతంలో ఎన్నడూ లేని విధంగా 200 ఓటర్లున్నా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎండ వేడిమి నియంత్రణతో పాటూ ఓటేయడానికి వచ్చే ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోక్‌సభ పరిధిలోని 2,061 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

Published : 09 May 2024 07:00 IST

అన్ని కేంద్రాల్లో పక్కా ఏర్పాట్లు
సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠ బందోబస్తు
‘ఈనాడు’తో నల్గొండ లోక్‌సభ ఆర్వో దాసరి హరిచందన

ఈనాడు, నల్గొండ : ‘ గతంలో ఎన్నడూ లేని విధంగా 200 ఓటర్లున్నా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎండ వేడిమి నియంత్రణతో పాటూ ఓటేయడానికి వచ్చే ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోక్‌సభ పరిధిలోని 2,061 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గత ఎన్నికల్లో నమోదైన 74.07 పోలింగ్‌ శాతాన్ని మించి ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నా’మని నల్గొండ లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) దాసరి హరిచందన స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు తదితర అంశాలపై ఆమె ‘ఈనాడు’తో ముఖాముఖీ మాట్లాడారు. ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేయాలని కోరారు.

యువ ఓటర్లకు ఆహ్వానాలు..

కొత్తగా ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకున్న వారు 61,143 మంది ఉన్నారు. వీరిలో కూడా సుమారు 53 శాతం మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరూ ఎన్నికల రోజును సెలవు దినంగా కాకుండా తప్పకుండా ఓటును వినియోగించుకునేలా ప్రత్యక్షంగా అందరికి ఓటు ఆహ్వానాలను అందజేస్తున్నాం. కళాశాలల్లో ఓటరు చైతన్య సదస్సులతో పాటూ పట్టణాల్లో అధికారులతో పలు అవగాహన సదస్సులను నిర్వహించాం. ఫొటో ఎగ్జిబిషన్‌లు, 2కే, 5కే రన్‌లు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నాం. మరోవైపు గత ఎన్నికల్లో 55 శాతం కంటే తక్కువగా ఓటింగ్‌ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కేవలం ఆరు కేంద్రాల్లో మాత్రమే గత ఎన్నికల్లో 55 శాతం కంటే తక్కువగా ఓటింగ్‌ నమోదైంది. ఈ ప్రాంతాల్లో అందరూ ఓటేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక సిబ్బందిని, అధికారులను ఆదేశించాం.

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులపై నిఘా..

రాష్ట్రంలో నల్గొండ లోక్‌సభ పరిధిలోనే ఎక్కువగా అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులున్నాయి. కేంద్ర బలగాలతో పాటూ స్థానిక పోలీసులతో ఈ చెక్‌పోస్టులపై నిఘా పెట్టాం. ఇప్పటి వరకు నగదు, మద్యం, ఇతర వస్తువులు కలిపి రూ. 20.13 కోట్ల వరకు సీజ్‌ చేశాం. ఇందులో నగదు రూ.9 కోట్ల వరకు ఉంటుంది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఫిర్యాదులు అయినా, సమాచారం తదితర అంశాలకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశాం. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో వాటిని పరిష్కరించే విధంగా కార్యాచరణ చేస్తున్నాం. 

70 శాతం కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌

లోక్‌సభ పరిధిలోని 2,061 పోలింగ్‌ కేంద్రాలకు గానూ సుమారు 1,800 కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం. మిగతా వాటిల్లో వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లు నిత్యం పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఒక్కో కేంద్రంలో పీవో, ఏపీవో, భద్రతా సిబ్బందితో పాటూ మొత్తం ఐదుగురు సిబ్బంది ఉంటారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 148 కేంద్రాల్లో కేంద్ర అదనపు బలగాలను మోహరించాం. ప్రతి కేంద్రంలో రెండు బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఓటింగ్‌ సమయంలో అవి మొరాయించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చేస్తున్నాం.

మహిళా సంఘాలతో సమావేశం..

గరిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్‌ సమయాన్ని ఎన్నికల సంఘం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పొడిగించింది. మరో గంట సమయం పెంపు వల్ల గ్రామాలతో పాటూ పట్టణాల్లో పోలింగ్‌ కచ్చితంగా పెరుగుతుంది. ఓటేయడానికి వచ్చే ఓటరుకు కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇప్పటికే అన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా ఉన్న సౌకర్యాలపై పర్యవేక్షణ చేశాం. లోక్‌సభ పరిధిలో మొత్తం 53 శాతం మహిళా ఓటర్లే ఉన్నారు. వారంతా తప్పకుండా ఓటేసే విధంగా గ్రామ, మండల మహిళా సమాఖ్యలతో సమావేశం నిర్వహించాం. ఓటు చైతన్య కార్యక్రమాలు చేపట్టాం. వారి కుటుంబ సభ్యులంతా ఓటేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని