logo

గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి

Published : 10 May 2024 06:34 IST

పాఠాలు వింటున్న విద్యార్థులు (పాత చిత్రం)
కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇంటర్‌ బోర్డు ప్రధాన కార్యదర్శి ఆదేశానుసారం ఇటీవల వెలువడిన ఇంటర్‌ వార్షిక పరీక్షా ఫలితాల్లో ఫెయిల్‌ అయిన, ప్రథమ సంవత్సరంలో ఇంప్రూవ్‌మెంట్‌ రాసే విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవలే ఉమ్మడి జిల్లాలో తరగతులు ప్రారంభమయ్యాయి.

ఆన్‌లైన్‌ ద్వారా తరగతుల బోధన:

 ప్రస్తుతం వేసవి సెలవులు కావడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో విద్యార్థుల సౌకర్యార్థం పాఠ్యాంశాల వారీగా సంబంధిత అధ్యాపకులు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఫెయిల్‌ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారు. ప్రస్తుతం అధ్యాపకులకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన శిక్షణ తరగతులు కొనసాగుతుండటంతో అధ్యాపకుల వీలు ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా బోధిస్తున్నారు. దీంతో పాటు పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు సైతం శిక్షణనిచ్చారు. కఠిన అంశాలపై సమగ్ర పట్టు సాధించేలా, గణిత, రసాయన, భౌతిక, జీవశాస్త్రం, జంతుశాస్త్రంలోని అన్ని అంశాలపై విద్యార్థులకు విపులంగా బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పలువురు అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యం
దస్రూనాయక్‌, డీఐఈవో, నల్గొండ

ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులకు సూచించాం. కొంతమంది విద్యార్థులు కేవలం ఒక్క సబ్జెక్టులోనే తప్పారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని తెలిపాం. విద్యార్థులు ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని వాట్సప్‌ గ్రూపుల ద్వారా తరచూ సంక్షిప్త సందేశాలను పంపుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని