logo

సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం

 వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు.

Published : 10 May 2024 06:36 IST

స్కూటీ డూమ్స్‌ కింద మద్యం సీసాలు తరలిస్తున్న దృశ్యం

 వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. తన స్కూటీని పలు భాగాలుగా విడగొట్టి డూమ్స్‌ మధ్యలో దాదాపు 100 మద్యం సీసాలను కనిపించకుండా దాచిపెట్టాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది.

 కోదాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నేపథ్యంలో తెలంగాణ మద్యానికి డిమాండ్‌ పెరిగింది. చెక్‌పోస్టుల వద్ద పోలీసుల కళ్లు కప్పి మద్యాన్ని రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ కారణంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఒక వ్యక్తి 750 ఎంఎల్‌ గల ఆరు మద్యం బాటిళ్లను మాత్రమే తరలించాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం పూర్తిగా నిషేధం. కాని సరిహద్దు నియోజకవర్గాల నుంచి కోట్లు విలువ చేసే మద్యం రాత్రికి రాత్రే ఏపీలోకి చేరుతోంది. దీనికి ప్రధాన కారణం ఏపీలో ఉన్న మద్యం పాలసీ. ధరలు అధికంగా ఉండటంతో అక్కడి ప్రజాప్రతినిధులు తెలంగాణ మద్యం దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. లారీలు, డీసీఎంలు, ప్రైవేటు వాహనాల్లో నిత్యావసర సరకుల కింద జాతీయ రహదారిలో తరలిస్తున్నారు. మరోవైపు ఎవరూ గుర్తించకుండా ఆటో సీట్ల కింద, స్కూటీ డూమ్స్‌ లోపలి భాగాల్లో మద్యాన్ని అమర్చి మరి తరలిస్తున్నారు.

 పోలీసుల కంట పడకుండా..

నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజుర్‌నగర్‌, మిర్యాలగూడ, సాగర్‌ నియోజకవర్గాల మీదుగా ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాలకు అక్రమంగా మద్యం కార్యకలాపాలు జరుగుతున్నాయి. కోదాడలోని నాలుగు మద్యం దుకాణాలు, నియోజకవర్గంలోని రెండు మండల కేంద్రాల్లోని నాలుగు మద్యం దుకాణాలు, చెక్‌పోస్ట్‌ సమీపంలో ఉన్న మరో దుకాణం నుంచి  రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణాకు తెరలేపుతున్నట్లు సమాచారం. కొనుగోలు చేసిన మద్యంతో పోలీసుల కంట పడకుండా దొడ్డిదారిన సరిహద్దు గ్రామాల నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్నారు.


నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు
-శంకర్‌, ఎక్సైజ్‌ సీఐ

మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరచి ఉండాలి. రాత్రి వేళల్లో అక్రమాలకు పాల్పడే దుకాణాలపై చర్యలు కఠినంగా ఉంటాయి. ఎన్నికల నియమావళి పాటించని దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం. మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందిస్తే కేసులు నమోదు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని