logo

నాడు హవా.. నేడు నామమాత్రం

ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి.

Published : 10 May 2024 06:37 IST

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. ఇప్పుడు మాత్రం నామమాత్రం పోటీకే పరిమితమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్టులకు పెట్టని కోట. కానీ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలు ఉంటే ఒక్క భువనగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. మరో నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నారు.

నల్గొండలో బలమైన శక్తి..

 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయదుందుభి మోగించారు. నాడు కమ్యూనిస్టుల మీద నిషేధం ఉండటంతో పీడీఎఫ్‌ పేరుతో పోటీ చేసినా కమ్యూనిస్టులను నాడు ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. నల్గొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన రావి నారాయణరెడ్డి జాతీయస్థాయిలో గుర్తించే మెజార్టీతో గెలిచారు.

  •  1957లో ద్విసభ్య నియోజకవర్గమైన నల్గొండలో ఒకటి కమ్యూనిస్టులు, ఒకటి కాంగ్రెస్‌ గెలుచుకుంది.
  • 1962లో తిరిగి సీపీఐ తరఫున పోటీ చేసిన రావి నారాయణరెడ్డి గెలిచారు.
  •  1962 తరువాత ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు 1991 వరకు గెలవలేకపోయారు. 1991 ఎన్నికల్లో బొమ్మగాని ధర్మభిక్షం గెలిచారు.
  •  1996లో ధర్మభిక్షం, 1998లో సురవరం సుధాకర్‌రెడ్డి, 2004లో సురవరం సుధాకర్‌రెడ్డి గెలుపొందారు. తరువాత పోటీలు లేకుండా మద్దతులకే పరిమితమయ్యారు. ఒకటి, రెండు సార్లు పోటీ చేసినా నామమాత్రపు పోటీనే జరిగింది.

   భువనగిరి నియోజకవర్గంలో:

ఇక్కడ పాత మిర్యాలగూడ నియోజకవర్గంలో నాలుగు సార్లు మినహా కొత్తగా భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటు జరిగిన తరువాత ఒక్కసారి కూడా కమ్యూనిస్టులు గెలవలేదు. ఎవరికో ఒకరికి మద్దతు ఇస్తూ పోయారు. మిర్యాలగూడ నియోజకవర్గం ఉన్నప్పుడు 1962లో లక్ష్మీదాస్‌(సీపీఐ), 1971, 1984, 1991 ఎన్నికలలో భీమిరెడ్డి నరసింహరెడ్డి సీపీఎం నుంచి గెలుపొందారు. ఆ తరువాత పోటీలో ఉన్నా నామమాత్రంగానే జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు