logo

ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి

ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 10 May 2024 06:47 IST

 అనిశెట్టిదుప్పలపల్లిలో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
తిప్పర్తి, న్యూస్‌టుడే: ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లిలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేయించి ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు రూ.50 కోట్లతో అమెరికా నుంచి ప్రత్యేక యంత్రాన్ని తెప్పిస్తున్నట్లు తెలిపారు. భారాస గత పదేళ్లుగా నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. నల్గొండ చుట్టూ రింగురోడ్డు నిర్మాణానికి రూ.1500 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని రహదారులను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నల్గొండను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కుందూరు రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తా అమిత్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పాశం రాంరెడ్డి, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, డీసీసీ ఉపాధ్యక్షుడు చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ జూకూరి రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పోలింగ్‌ బూత్‌లో మెజార్టీ రావాలి..

 కనగల్‌,న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రతి పోలింగ్‌ బూత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మెజార్టీ తీసుకురావాలని మంత్రి  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం దర్వేశిపురం వద్ద నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత శాసన సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే అధికంగా తీసుకరావాలన్నారు. మండలంలో వంతెనలు, రోడ్లు మంజూరు చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి వరికి మద్దతు, బోనస్‌ కూడా ఇస్తామని తెలిపారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని కలుపుకొని ముందుకు సాగాలని మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని