logo

విమర్శలు చేసే.. విజయం కాంక్షించే

భువనగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

Published : 10 May 2024 06:58 IST

కేంద్రమంత్రికి చిత్రపటాన్ని బహూకరిస్తున్న భువనగిరి భాజపా నాయకులు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి : భువనగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నియోజకవర్గంలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్‌ నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, పార్టీ నాయకుల్లో గెలుపుపై ఆశలు నింపేలా ఆయన ప్రసంగం సాగింది. సుమారు 30 నిమిషాలు ప్రసంగించిన అమిత్‌ షా ప్రధానంగా రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేస్తూనే గత పదేళ్లలో మోదీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో భారాస గత పదేళ్లలో తీవ్ర అవినీతి చేసిందని ఆరోపణలు చేస్తూ..ప్రస్తుత రేవంత్‌ సర్కారు సైతం కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల అమలును ప్రశ్నించారు. భాజపా పాలనలోనే దేశం సురక్షితంగా ఉందన్నారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని..అందుకు తెలంగాణ కీలకంగా పనిచేస్తుందని ఉద్ఘాటించారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని  ప్రస్తావిస్తూ బూర నర్సయ్యను గెలిపించాలన్నారు.

అవీ...ఇవీ

  •  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రణామం చేస్తూ అమిత్‌ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
  •  కాకతీయుల రాణి రుద్రమదేవి, స్వర్ణగిరి వెంకటేశ్వర ఆలయం, కొమరవెళ్లి మల్లన్న, కొలనుపాక జైనమందిరాన్ని అమిత్‌ షా ప్రస్తావించారు.
  •  రాహుల్‌గాంధీని, కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తూ ప్రధాని మోదీ చేసిన పనులను చెబుతున్నప్పుడల్లా సభికుల్లో ఉత్సాహం నెలకొంది.
  •  షెడ్యూల్‌ కంటే సుమారు గంట ఆలస్యంగా సభ ప్రారంభమైంది. అమిత్‌షా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ వైఫల్యంపైనే ఎక్కువగా మాట్లాడారు.
  •  భాజపా ఎంపీ అభ్యర్థి బూర తన ప్రసంగంలో సినిమా డైలాగ్‌లతో అలరించారు.
  •  కార్యక్రమంలో పార్టీ ప్రభారీ పాపారావు, నాయకులు కడియం రామచంద్రయ్య, నకిరేకంటి మొగులయ్య, ఆరుట్ల దశమంతరెడ్డి, నాగం వర్షిత్‌రెడ్డి, చందా మహేందర్‌ గుప్త, పడమటి జగన్మోహన్‌రెడ్డి, మాయ దశరథ, శివకుమార్‌, రత్నాపురం బలరాం, బందారపు లింగస్వామి, చిక్కా కృష్ణ, దయానంద్‌ గౌడ్‌, చందుపట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

    దిల్లీలో మోదీ... భువనగిరిలో బూర

       - బూర నర్సయ్యగౌడ్‌

దిల్లీలో మోదీ, భువనగిరిలో బూర నర్సయ్య గెలుపు ఖాయమైంది. దీనిని ఎవరూ అడ్డుకోలేరు. కాంగ్రెస్‌ గెలిచేదీ లేదు, రాహుల్‌ ప్రధాని అయ్యేది లేదు. ఎంపీగా ఎన్నికవగానే దిల్లీలో తెలంగాణ భవన్‌ మాదిరిగా హైదరాబాద్‌లో భువనగిరి భవన్‌ను నిర్మిస్తాం. ఎదుటి పార్టీలు డబ్బు సంచులతో వస్తున్నారు. నా బలం మోదీ, బలగం కార్యకర్తలు. నా సిద్ధాంతం హిందూత్వం. కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేసేవారే కరవయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని