logo

అక్రమాల లెక్క.. తేలుతోంది!

ఎట్టకేలకు జిల్లా అధికారులు కదిలారు. మూడేళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్న గ్రావెల్‌ దందాపై దృష్టిసారించారు. రూ. కోట్ల విలువైన ప్రకృతి సంపదను తరలించిన తీరును చూసి అవాక్కయ్యారు.

Published : 26 Jan 2023 01:58 IST

కనిగిరి రిజర్వాయరు ప్రాంతంలో మైనింగ్‌ సర్వే
రోవర్‌తో తవ్విన గ్రావెల్‌ పరిమాణం లెక్కింపు
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు, న్యూస్‌టుడే, కోవూరు

కనిగిరి రిజర్వాయర్‌ గ్రావెల్‌ తవ్విన ప్రాంతం (డ్రోన్‌ చిత్రం)

ఎట్టకేలకు జిల్లా అధికారులు కదిలారు. మూడేళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్న గ్రావెల్‌ దందాపై దృష్టిసారించారు. రూ. కోట్ల విలువైన ప్రకృతి సంపదను తరలించిన తీరును చూసి అవాక్కయ్యారు. ఇంత పెద్దమొత్తంలో గ్రావెల్‌ కాజేస్తున్నా.. స్థానిక అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని విస్తుబోయారు. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు సమీపంలోని కనిగిరి రిజర్వాయరు ప్రాంతంలో కొందరు వైకాపా నాయకులు చేస్తున్న అక్రమాన్ని నెల రోజుల వ్యవధిలో ‘ఈనాడు’ రెండు సార్లు వెలుగులోకి తీసుకొచ్చింది. గత నెల 23న ‘కళ్లు మూసుకుంటాం.. కానీయండి’, ఈ నెల 22న ‘అడ్డగింత.. మాకో లెక్క’ శీర్షికలతో కథనాలు ప్రచురించింది. దాంతో స్పందించిన జేసీ సమగ్ర విచారణ చేయాలని మైనింగ్‌ అధికారులను ఆదేశించారు. దాంతో వారు ముందుకు కదిలారు. భూగర్భ గనులశాఖ విజిలెన్స్‌ డీఈ సూర్యచంద్రరావు పర్యవేక్షణలో.. ఆ శాఖ విజిలెన్స్‌ విభాగం, టెక్నికల్‌ విభాగం, స్థానిక సర్వేయర్లతో సర్వే ప్రారంభించారు. అసలు ఆ ప్రాంతంలో తవ్వకాలకు ఏమైనా అనుమతి ఇచ్చారా? ఇప్పటి వరకు తరలించిన గ్రావెల్‌ ఎంత? అనే కోణంలో విచారిస్తున్నారు. అత్యాధునిక డీజీపీఎస్‌ రోవర్‌ సాయంతో లెక్క కొలుస్తున్నారు. ఇప్పటికే 50 శాతం పూర్తవగా.. మరో నాలుగు రోజుల్లో సమగ్ర వివరాలను అధికారులకు అందజేయనున్నట్లు మైనింగ్‌ అధికారులు తెలిపారు.

జనవరి 22, 2023

అధికారులే సూత్రధారులు

సహజ సిద్ధ కనిగిరి రిజర్వాయరు కట్టను తవ్వడంలో అధికారులే సూత్రధారులుగా కనిపిస్తున్నారు. సర్వే నంబరు 920లో ఉన్న భూమి రిజర్వాయరుదని, అక్కడ ఎవరికీ పట్టాలు ఇచ్చేది లేదని నాటి కలెక్టర్‌ శేషగిరిబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం మానేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు కొందరు నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి మార్చడం ఒక ఎత్తయితే.. ఇరిగేషన్‌ అధికారులు మాత్రం అసలు ఆ భూమి మాది కాదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇరుశాఖల మధ్య సమన్వయం కొరవడటమే అక్రమార్కులకు కలిసొచ్చింది. ప్రస్తుతం సర్వే చేస్తున్న అధికారులకు అదే సమాధానం చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులు తెలియకుండా పని చేస్తున్నారా? అనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్‌ 23, 2022

అధికారం ఉన్నా.. అడ్డుకోకనే...

ప్రస్తుతం తవ్వకాలు జరిగిన ప్రాంతంలో ఇప్పటి వరకు మైనింగ్‌.. పెన్నా రిజర్వాయరు కోసం 55 వేల క్యూబిక్‌ మీటర్లకు ఒకసారి అనుమతి ఇచ్చారు. ఆ సమయంలో ఇరిగేషన్‌, రెవెన్యూశాఖలను అడగ్గా.. తమకు ఎలాంటి ఇబ్బంది లేదని నిరభ్యంతర పత్రం ఇవ్వడమే గ్రావెల్‌ మాఫియాకు తెరదీసినట్లయింది. అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసులకు అధికారం ఉంది. కానీ, ఆ మేరకు అడుగులు వేసిన వారు లేరు. కనిగిరి రిజర్వాయరు కట్టమీదనే ఇరిగేషన్‌ ఏఈ కార్యాలయం ఉన్నా.. తమకేమీ తెలియదన్నట్లు మిన్నకుండిపోయారు. 2016 జీవో నంబరు 20 ప్రకారం మండల పరిధిలో జరిగే మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించి, అక్రమాలు జరిగితే అడ్డుకునే అధికారం డిప్యూటీ తహసీల్దారుకు ఉంది. పోలీసులకైతే చెప్పనవరం లేదు. అనుమానం వచ్చిన ఏ వాహనాన్ని అయినా తనిఖీ చేసే అధికారం ఉంది. అయినా.. బుచ్చిరెడ్డిపాళెంలో ఒక్కసారి కూడా ఉపయోగించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎలాగైనా అధికారులపై ఒత్తిడి తెచ్చి.. చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఇకపై ఎట్టి పరిస్థితుల్లో గ్రావెల్‌ను తరలించేందుకు ఒప్పుకొనేది లేదని చెబుతుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని