logo

పన్నేసి.. బతుకులు పిండేసి!

ప్రజల కోసం.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు వారి సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. వారిపై తలకు మించిన భారం వేయకుండా శ్రమించాలి.

Updated : 12 Apr 2024 06:51 IST

పట్టణ ప్రజల నడ్డి విరుస్తున్న జగన్‌ ప్రభుత్వం
నాలుగేళ్లుగా ఏటా 15 శాతం చొప్పున పెంపు

ప్రజల కోసం.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు వారి సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. వారిపై తలకు మించిన భారం వేయకుండా శ్రమించాలి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో పెరిగిన అరకొరకే ప్రతిపక్ష నేతగా గగ్గోలు పెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా పనిచేశారు. పట్టణాల్లో అయిదేళ్లకు ఒకసారి ఆస్తి పన్ను పెంచే విధానాన్ని పక్కనపెట్టి.. ఏటా పెంచుతూ పోయే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనలు  చేసినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా నాలుగేళ్లుగా నగర, పట్టణ వాసుల నడ్డి విరుస్తూనే ఉన్నారు.

ఈనాడు, నెల్లూరు

వార్షిక అద్దె విలువ(వీఆర్‌వీ) ఆధారంగా పట్టణ, నగరాల్లో అయిదేళ్లకోసారి ఆస్తి పన్ను పెంచేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వీఆర్‌వీకి బదులుగా ఆస్తి మూలధన విలువ(సీవీ) ఆధారంగా పన్ను పెంచే విధానం అమల్లోకి తెచ్చింది. దానికి మళ్లీ స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖతో లింకు పెట్టింది. ఆస్తుల విలువను.. ఆ శాఖ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా పెంచాలని నిర్ణయించింది. కొత్త విధానం అమల్లోకి రాకముందు 2020-21లో నెల్లూరు నగరంలో డిమాండ్‌ రూ. 47.47 కోట్లు ఉండగా- కొత్త విధానం వచ్చాక 2021-22 వార్షిక డిమాండ్‌ రూ. 50.10 కోట్లకు పెరిగింది. అంటే పట్టణ ప్రజలపై రూ. 2.63 కోట్ల భారం వేశారు. పెరిగిన మొత్తం పన్నుల్లో ఇది 15 శాతమే. పెరిగిన దానికి సమానమయ్యే వరకు 2022-23, 2023-24, 2024-25లోనూ 15 శాతం చొప్పున పెంచి అమలు చేశారు. గత రెండేళ్లలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఆస్తుల విలువలు పెంచింది. అంటే ఆస్తి పన్ను మొత్తం కూడా భారీగానే పెరిగింది. ఈ మొత్తంలో నుంచి గత నాలుగేళ్లలో 15 శాతం చొప్పున రూ. 30 కోట్లపైనే ప్రజలపై జగన్‌ ప్రభుత్వం భారం వేసింది.

చెత్త తీయరు.. రోడ్లు వేయరు

ఏటా ఆస్తి పన్ను సవరిస్తుండటంతో గత నాలుగేళ్లలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆదాయం భారీగా పెరిగినా.. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన.. మెరుగుదలపై దృష్టి సారించలేదు. 2021-22 వార్షిక డిమాండ్‌ రూ. 47.47 కోట్లు ఉంటే.. 2024-25 నాటికి రూ.76.08 కోట్లకు చేరింది. అంటే.. అదనంగా రూ. 28.61 కోట్లకు పెరిగింది. ఆ స్థాయిలో సదుపాయాలు మాత్రం ఒనగూరలేదు. కౌన్సిల్‌ సమావేశం జరిగిన ప్రతిసారి అధికార వైకాపా కార్పొరేటర్లు చెత్త తీయడం లేదు. రోడ్లు వేయడం లేదు. కనీస సదుపాయాలపైనా దృష్టిసారించడం లేదని నిరసనలు, ఆందోళనలు చేపట్టడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనికి తోడు నగరపాలక సంస్థ పీడీ ఖాతాను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్‌)కు అనుసంధానించడంతో.. ఆయా ఖాతాల్లో నిధులు కనిపిస్తున్నా.. బిల్లులు పెడితే కావడం లేదు. దాంతో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నెల్లూరు నగరంలోని ఓ ఇంటికి 2016-17లో ఆస్తి పన్ను రూ.1494

‘వైకాపా అధికారంలోకి రాకముందు.. ఉన్న అన్ని ప్రభుత్వాలు ఆస్తి పన్నును అయిదేళ్లకు ఒకసారి పెంచేవి. దాంతో అదో భారంగా అనిపించేది కాదు.. అదీ భారమనిపిస్తే.. అయిదేళ్లకు బదులుగా 10-15 ఏళ్లకు ఒకసారి ఆస్తి పన్నులు సవరించిన పరిస్థితులు ఉన్నాయి. జగన్‌ సీఎం అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది.’

అదే ఇంటికి 2023 మార్చిలో రూ.7,869 చెల్లించిన బిల్లు

‘గత నాలుగేళ్లుగా ఏటా ఆస్తి పన్ను పెరుగుతోంది. ఇది చాలదన్నట్లుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఆస్తుల విలువ పెంచినప్పుడుల్లా మళ్లీ పెరుగుతోంది. దాన్ని ఒకేసారి ప్రజలపై రుద్దితే వ్యతిరేకత వస్తుందని.. పెరిగిన దానికి సమానమయ్యే వరకు ఏటా 15శాతం చొప్పున విధిస్తోంది.  

‘కొత్త ఇళ్లు నిర్మించుకునే వారికి పాత పన్ను విధానం లేదు కాబట్టి.. ఏటా 15 శాతం పెంపుదల వర్తించకపోవడంతో.. రిజిస్ట్రేషన్లశాఖ విలువ ప్రకారం విధిస్తున్న ఆస్తి పన్ను రూ. వేలు, రూ. లక్షల్లో ఉండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.’


సామాన్యుడు బతికే పరిస్థితి లేదు

అయిదేళ్ల కిందట ఇంటి పన్ను రూ. 150 కట్టేవాళ్లం.. ప్రస్తుతం రూ. 1800 వస్తోంది. అదే కమర్షియల్‌ ఇళ్లకు రూ.వేయి ఉండేది.ఇప్పుడు రూ. ఏడు వేలు అయింది. ఇంత మొత్తంలో పన్నులు వేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లకు గుంతలు పడితే.. మరమ్మతులు చేసే దిక్కులేదు. నగరంలో ఎక్కడా ఫాగింగ్‌ సదుపాయం లేదు. పెరిగిన ఖర్చులతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితి కనిపించడం లేదు.  

సురేష్‌బాబు, నెల్లూరు


ఖర్చులు పెరిగాయి.. సంపాదన లేదు

గడిచిన అయిదేళ్లలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఆస్తి పన్ను రూ. 1500 కడుతుండగా- రూ. 5,200 అయింది. దీనికి తోడు కరెంట్‌, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. జీతాలు మాత్రం పెరగలేదు. దాంతో ఇంటిని పోషించాలా? పిల్లలను చదివించాలా? అర్థం కావడం లేదు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఇక అంతే.. సచివాలయ ఉద్యోగులను పంపి.. బలవంతంగా పన్ను వసూలు చేయిస్తున్నారు. జరిమానా వేస్తామని బెదిరించిన రోజులు ఉన్నాయి. 

రమేష్‌, నెల్లూరు


కొత్త ఇల్లు కట్టుకోవాలంటే భయం

ప్రభుత్వాలు ప్రజలను ఆదుకునేలా ఉండాలిగానీ.. ఇబ్బంది పెట్టేలా కాదు. గత అయిదేళ్లలో ఆస్తి, చెత్త పన్నులు వేశారు. ప్రతి మధ్య తరగతి కుటుంబం కల సొంత ఇల్లు కట్టుకోవడం. అప్పు చేసి కట్టుకుంటున్న వారు పన్నులకు భయపడుతున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు పెరిగాయి. వసూళ్లకు తగ్గట్టు సౌకర్యాలు కల్పిస్తారా? అంటే అదీ లేదు. ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ఆదాయ మార్గాలు చూపించకుండా.. కష్టపడి సంపాదించిన సొమ్మును పన్నుల రూపంలో లాక్కోవడం సరికాదు.

రవి, నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని