logo

జగన్‌ అనే నేను.. సీపీఎస్‌పై మాట తప్పాను!

జగన్‌ ఏలుబడిలో ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది. ఆర్థిక ప్రయోజనాల సంగతి పక్కనపెడితే.. కనీసం ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాటి కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated : 15 Apr 2024 07:53 IST

అయిదేళ్లుగా ఉద్యోగులను మోసం చేసిన వైకాపా ప్రభుత్వం
డీఏలు, పీఆర్సీ, ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో జాప్యం

జగన్‌ ఏలుబడిలో ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది. ఆర్థిక ప్రయోజనాల సంగతి పక్కనపెడితే.. కనీసం ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాటి కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2023 జులై డీఏలను ఇంత వరకు ప్రకటించలేదు. పాత డీఏ బకాయిల చెల్లింపుల ఊసేలేదు. 11వ పీఆర్సీ బకాయిలు ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత లేదు. కమిషనర్‌ను వేసి ఎనిమిది నెలలైనా.. ఆయనకు కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదు. పీఎఫ్‌, జీపీఎఫ్‌ రుణాలు, ఆర్జిత సెలవుల బిల్లులకు దిక్కు లేకుండా పోయిందని, పదేపదే ఆందోళనలు చేయడం, ఎన్నికలు రావడంతో కొందరికి మాత్రమే పడుతున్నాయి’ అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, నెల్లూరు: ‘జగన్‌ అనే నేను అధికారంలోకి వచ్చిన వారంలోగా కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్‌) రద్దు చేస్తానని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మాటిస్తున్నా’నంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన జగన్‌మోహన్‌రెడ్డి... సీఎం అయ్యాక మాట తప్పి.. మడమ తిప్పారు. ప్రతి డీఏ సమయానికి వచ్చేలా చేస్తానని, రావాల్సిన ప్రయోజనాలన్నీ సకాలంలో ఇచ్చేస్తానని గొప్పలు చెప్పారు. ఆపై అన్నింటికీ చరమగీతం పాడారు. అధికారంలో ఉన్న నాయకులు మాట నిలుపుకోలేకపోతే.. పదవికి రాజీనామా చేసి.. ఇంటికి వెళ్లిపోవాలన్న జగన్‌కు.. ప్రస్తుతం ఆ మాటలే గుర్తులేవు. పైగా సీఎంగా సీపీఎస్‌ రద్దు చేయడం నిమిషం పని.. కానీ, పాత పింఛను అమలైతే మోయలేని భారం పడుతుందని ఆలోచిస్తున్నానని ఆయన చెప్పడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందు ఇదంతా తెలియకుండానే హామీ ఇచ్చారా? అని మండిపడుతున్నారు. వై నాట్‌ ఓపీఎస్‌.. అని నినదిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అడిగితే అరెస్టు..ఆందోళన చేస్తే కేసు

సీపీఎస్‌ రద్దు చేసి.. పాత పింఛను పథకం అమలు చేస్తానన్న వాగ్దానాన్ని వదిలేసి.. గ్యారంటీ పింఛను పథకం(జీపీఎస్‌) విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో దానిపై ప్రశ్నించినా.. ఆందోళన చేసినా.. నిరసన తెలిపినా కేసులు పెడతామని బెదిరించారు. చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ముందస్తుగా నోటీసులు ఇవ్వడంతో పాటు గృహ నిర్బంధాలు చేశారు. ధర్నాకు పిలుపునిచ్చినా.. సమావేశం పెట్టుకుంటామన్నా పోలీసుల సాయంతో అడ్డుకున్నారు. బయటకు వస్తే పోలీసు స్టేషన్‌కు తరలించడం ఈ ప్రభుత్వంలో పరిపాటిగా మారిందని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు జిల్లాకు చెందిన 14 మంది యూటీఎఫ్‌ నాయకులపై కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వారు ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని చెబుతున్నారు.

మాట మార్చి మోసం చేశారు

ఉద్యోగులకు ఓపీఎస్‌ అమలు చేస్తామన్న జగన్‌.. ఆ హామీని తుంగలో తొక్కారు. సీపీఎస్‌ ఉద్యోగుల జీతాల నుంచి ప్రభుత్వం 10 శాతం మినహాయించి.. దానికి తాను మరో పది శాతం కలిపి ఉద్యోగి ప్రాన్‌ ఖాతాకు జమ చేస్తుంది. ఆ నిధులను జమ చేయకపోగా.. ఉద్యోగుల జీతాల నుంచి తీసుకున్న పది శాతాన్ని కూడా వాడేసుకుంటోంది. డీఏలు, పీఆర్సీ, సీపీఎస్‌ ఎరియర్స్‌, ఈఎల్స్‌ వంటి వాటితో రూ. లక్షలు నష్టపోయాం. జీపీఎస్‌ తీసుకురావడంతో ఉద్యోగుల పని పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. వైకాపా ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోంది.

వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘం నేత.

పాత పింఛను మాత్రమే అంగీకరిస్తాం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్‌ విధానాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులు అంగీకరించడం లేదు. పాత పెన్షన్‌ విధానానికి ఏదీ ప్రత్యామ్నాయం కాదు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరుస్తారని అయిదేళ్లుగా ఎదురు చూశాం. దేశంలోని పలు రాష్ట్రాలు పాత పెన్షన్‌వైపు అడుగులు వేస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓపీఎస్‌ అమలు చేయాలి.

సుధావాణి, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం మహిళా నాయకురాలు

ఉద్యోగుల హక్కు

2004 సెప్టెంబరు 1 నుంచి సీపీఎస్‌ అమల్లోకి వచ్చింది. దీనికి ముందు నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ.. సుమారు పది వేల మంది సెప్టెంబరు తర్వాత ఉద్యోగాల్లో చేరారు. వీరికి పాత పింఛను పథకం అమలు చేయాలని కేంద్రం ఆదేశించినా.. జగన్‌ సర్కారు సీపీఎస్‌నే అమలు చేస్తూ ఇబ్బంది పెడుతోంది. సీపీఎస్‌ ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలను నగదు రూపంలో చెల్లించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. సీపీఎస్‌తో ఉద్యోగులకు పింఛను వచ్చే పరిస్థితి లేదు. జీవితాంతం ప్రభుత్వం కోసం కష్టపడి పనిచేసిన ఉద్యోగులు.. ఉద్యోగ విరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించేలా పెన్షన్‌ ఇవ్వాలి. ప్రస్తుతం దాని కోసం ఉద్యోగులు కాంట్రిబ్యూట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

బాబురెడ్డి, యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని