logo

చతికిలబడి

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు, కళాశాలలు తీర్చిదిద్దామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. ఫలితాలు పరిశీలిస్తే.. ఆర్భాటమేనని తేలిపోయింది. జగన్‌ ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లో వసతులు కల్పించలేదు.

Published : 16 Apr 2024 03:06 IST

హైస్కూల్‌ ప్లస్‌లో తగ్గిన ఉత్తీర్ణత
సంతపేట, వావిళ్లలో జీరో ఫలితాలు
న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు, కళాశాలలు తీర్చిదిద్దామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. ఫలితాలు పరిశీలిస్తే.. ఆర్భాటమేనని తేలిపోయింది. జగన్‌ ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లో వసతులు కల్పించలేదు. బోధకులను నియమించ లేదు. ఫలితంగా ఇంటర్‌ ఫలితాలు నిరాశాజనకంగా ఉండి.. రెండుచోట్ల జీరో ఫలితాలు నమోదయ్యాయి.

గత విద్యా సంవత్సరంలో మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాలల్లో అత్యధికంగా విద్యార్థులున్న చోట ఇంటర్‌ తరగతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. హడావుడిగా ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిని, ల్యాబ్‌లు, తరగతి గదుల సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చలేదు.

జిల్లాలో 13 పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ తరగతులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వీటిలో మొదటి సంవత్సరం ఇంటర్‌లో 200 మంది, ద్వితీయ సంవత్సరం వివిధ కోర్సుల్లో 69 మంది విద్యార్థులు చేరారు. ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన చేపట్టారు. అధ్యాపకులు లేక ఉన్నవారికి ఇంటర్‌ పాఠ్యాంశాలు బోధించే అనుభవం లేక విద్యార్థులు ఉత్తీర్ణులుకాని పరిస్థితి నెలకొంది.


అన్నిచోట్లా తగ్గి..

డావుడిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లో ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. నెల్లూరు నగరంలోని సంతపేట హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఇద్దరు పరీక్ష రాయగా ఇద్దరూ, సీఈసీలో పది మందికి ఏడుగురు పరీక్ష తప్పారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 20 మంది పరీక్ష రాయగా ఇద్దరే ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ సీఈసీలో 12 మందికి ముగ్గురే పాస్‌ అయ్యారు. విడవలూరు మండలం వావిళ్లలో ప్రథమ సంవత్సరం బైపీసీలో ముగ్గురు పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులు కాలేదు. ఇదే పాఠశాలలో ద్వితీయ సంవత్సరం బైపీసీలో ఒకరు ఉండగా తప్పారు. ద్వితీయ సంవత్సరం సీఈసీలో 8 మంది పరీక్షకు హాజరు కాగా ఇద్దరే ఉత్తీర్ణులయ్యారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో ప్రథమ సంవత్సరంలో 200 మందికి 82 మంది, ద్వితీయ సంవత్సరం ఇంటర్‌లో 69 మందికి 44 ఉత్తీర్ణులయ్యారు. నెల్లూరులోని సంతపేట, విడవలూరు మండలం వావిళ్ల హైస్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణత నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని