logo

జగన్‌ పాలనలో చేనేతలకూ రిక్తహస్తమే

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో జిల్లాలోని చేనేత రంగం కుదేలైంది. వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడిన ఈ రంగంలోని కార్మికులను ఆదుకునే విషయంలో వైకాపా ప్రభుత్వం అధ్వానంగా వ్యవహరిస్తోంది.

Published : 16 Apr 2024 03:10 IST

నాటి రాయితీలన్నీ రద్దు

సంగం సాయినగర్‌లోని చేనేత కార్మికురాలు పోలిశెట్టి పెద్దక్క పేరున తరుణవాయి చెరువులో 95 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. పల్లపు ప్రాంతం అవడంతో మూడేళ్లుగా ముంపులో ఉంటూ పంట పండటం లేదు. రైతు భరోసా మాత్రం ఆమెకు అందుతోంది. దీంతో నేతన్న నేస్తం కింద లబ్ధి అందడం లేదు. రైతు భరోసా రద్దు చేసి నేతన్ననేస్తం అందించాలని సచివాలయం చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లభించలేదు.

సంగం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో జిల్లాలోని చేనేత రంగం కుదేలైంది. వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడిన ఈ రంగంలోని కార్మికులను ఆదుకునే విషయంలో వైకాపా ప్రభుత్వం అధ్వానంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలను రద్దు చేయడంతో ఈ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది.

జిల్లాలో సంగం, వింజమూరు, కోవూరు, పాటూరు, గుమ్మళ్లదిబ్బ, చెన్నూరు, ఆత్మకూరు, ఏ.ఎస్‌.పేట, కావలి యడవల్లి, కొత్తపేట, నారాయణరెడ్డిపేట, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 6,850 మగ్గాలున్నాయి. అనధికారికంగా మరో రెండువేలున్నాయి. జిల్లాలో చేనేత కుటుంబాలు 25 వేల వరకు ఉన్నా కులవృత్తి గిట్టుబాటు కాక, మగ్గం మూలన పడేసి తాపీ, వంట, ఉపాధిహామీ తదితర పనులకు వెళుతున్నారు. ముడి సరకు, జరీ ధరలు రెట్టింపవటం, డిమాండు తగ్గటంతో నేతన్నలు ఇబ్బందిపడుతున్నారు. దీనికితోడు జీఎస్టీ తదితరాలు గుదిబండలా మారాయి. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడంతో విక్రయ ధరలు పెరిగి గిరాకీ పూర్తిగా తగ్గింది. ఎగుమతులకు నష్టం కలిగించింది.

  • మగ్గంపై తయారయ్యే 18 రకాల డిజైన్లను మరమగ్గాలపై నేయకూడదనే నిషేధం ఉన్నా అమలుకావటంలేదు. వాటిపై తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తుండటంతో వాటిని తక్కువ ధరకు విక్రయించి మగ్గం ఉత్పత్తుల అమ్మకాలకు గండికొడుతున్నారు.
  • గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేనేత సంరక్షణకు నూలు కొనుగోలుపై రాయితీ ఇచ్చారు. చేనేత సహాయ నిధి, పొదుపు నిధి, రంగులు, పనిముట్ల కింద రాయితీలిచ్చారు. 50 ఏళ్లు దాటిన వారికి చేనేత పింఛను కింద రూ.రెండువేలు అందించారు. చేనేత పరిశ్రమ మనుగడతోపాటు కార్మికులకు వ్యక్తిగతంగా కొంత ఊరట ఇచ్చే క్రమంలో 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుకు జీవో విడుదల చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అమలుకు నోచుకోలేదు.
  • తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన బీమా, ఆరోగ్య పథకం అమలవలేదు. ఈ పథకం కింద చేనేత కార్మికుడు ప్రీమియంగా  రూ.వంద చెల్లిస్తే ఏడాదిపాటు రూ. 15 వేల ఆరోగ్యబీమా వర్తించేది. వృత్తి పరంగా ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, కంటి చూపులోపం, క్షయ తదితర వ్యాధులకు గురైనప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని బిల్లు పెడితే రూ. 15 వేలు అందేవి.
  • రూ.80కే బీమా సదుపాయం ప్రస్తుతం లేదు. ఈ పథకాన్ని వైకాపా ప్రభుత్వం రద్దు  చేసింది.
  • నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంటు పథకం కింద చేనేత కార్మికుడికి నూలు కొనుగోలుకి పదిశాతం రాయితీ, నేషనల్‌ క్రెడిట్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ పథకం కింద కార్మికులకు ముద్ర యోజన రుణాల కింద రూ.50 వేల బ్యాంకు రుణాలు ఇచ్చేవారు. మగ్గం కార్మికులకు వర్క్‌షెడ్‌ కోసం రూ.75 వేలు ఇచ్చేవారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన ఈ పథకాలన్నింటినీ వైకాపా అధికారంలోకి రాగానే రద్దు చేసింది.
  • ఆధునిక శిక్షణ, పనిముట్లు, షెడ్ల ఏర్పాటు, పెట్టుబడి కింద రుణ సదుపాయం, నూలు, జరీ తదితర ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతులపై విధించిన అయిదు శాతం జీఎస్టీని తొలగించటం, ముడి నూలు, అద్దకం రంగుల కొనుగోలుపై పది శాతం రాయితీ.
  • చేనేత రిజర్వేషన్‌ చట్టం మేరకు నిర్ణీత ఉత్పత్తులను మరమగ్గాలపై ఉత్పత్తి చేయకుండా చూడటం, ప్రతి చేనేత కుటుంబానికి రూ. 300 యూనిట్ల మేర ఉచిత విద్యుత్తు సరఫరా తదితర అంశాలను ఈ ప్రభుత్వం పరిగణలోకి  తీసుకోలేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
  • చేనేత రంగంపై ఆధారపడి 18 ఉపకులాలున్నాయి. అచ్చులతికే వారు, కండెలు చుట్టేవారు, పొడుగులు చుట్టేవారు, నూలు వడికే వారు, పన్నీలు కట్టేవారు, మగ్గాలు తయారు చేసేవారు, అచ్చులు కట్టేవారు, నూలుకి రంగులు అద్దేవారు తదితర  ఉపవృత్తులు వారున్నారు. వారందరినీ నేతన్న నేస్తం పథకానికి అనర్హులను చేశారు.
  • వైకాపా ప్రభుత్వం నేతన్న నేస్తం పథకంతోనే సరిపెట్టింది. మగ్గమున్న కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇందులోనూ అనేక తిరకాసులు పెట్టి ఎగనామం పెడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని