logo

మద్యం చిచ్చు.. జగన్‌ ఉచ్చు!

దశలవారీగా మద్య నిషేధం కోసం ఏటా దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వెళతామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం... ఆ మాట తప్పింది.

Updated : 16 Apr 2024 06:26 IST

సామాన్యుల ఇళ్లు.. ఒళ్లు.. గుల్ల
నిషేధం మరిచి.. జీవితాలతో ఆటలు
ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, నేరవార్తలు, న్యూస్‌టుడే

‘కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే, మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యం నిషేధిస్తాం. తర్వాత 5 నక్షత్రాల హోటళ్లలోనే దొరికేలా చేస్తాం’

- 2019 ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది.


మద్య నిషేధం అమలుపై మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఓట్లు అడిగే సమయానికి అయిదు నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేస్తాం.

- అధికారంలోకి వచ్చిన తర్వాత దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి చెప్పిన మాటలివి.


గడిచిన అయిదేళ్లలో దుకాణాల సంఖ్య తగ్గించడం మాట అటుంచితే.. మద్యంపై వచ్చే ఆదాయంపైనా అప్పులు తీసుకొచ్చారు. తమ జేబులు నింపుకొనేందుకు సామాన్యుల ఇళ్లు, ఒళ్లు గుల్ల చేశారు. దిక్కుమొక్కు లేని బ్రాండ్లు తెచ్చి.. జనాన్ని జీవచ్ఛవాలుగా మార్చారు. ఇదీ కాపురాల్లో.. ప్రజల జీవితాల్లో మద్యం పెట్టిన చిచ్చు.. జగనన్న ఉచ్చు.

శలవారీగా మద్య నిషేధం కోసం ఏటా దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వెళతామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం... ఆ మాట తప్పింది. 2019 అక్టోబరులో.. జిల్లాలో 200 మద్యం దుకాణాలు ఉండగా- 2020 మార్చిలో 175కు తగ్గించినా.. 2021-21, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో ఆ దిశగా చర్యలు లేవు. పైగా 18 దుకాణాలు పెంచడం మద్య నిషేధంపై జగన్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి దర్పణం పడుతోంది. దీనికి తోడు ప్రతి గ్రామంలో గొలుసు దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. బార్ల నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. 24 గంటలు అందుబాటులో ఉంచుతూ ప్రజలను దోచుకుంటుండగా- అందుకు స్థానిక వైకాపా నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకూ సాహసించడం లేదు.

ఆదాయమే.. పరమావధిగా

జిల్లాలో 193 మద్యం దుకాణాలు, 45 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉండగా- వీటిలో ఒక్క నెల్లూరు నగరంలోనే సుమారు 30 వరకు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం మద్య నిషేధం దిశగా అయిదేళ్లలో ఒక్క అడుగు వేయకపోగా.. మరింత ఆదాయమే లక్ష్యంగా పర్యాటక కేంద్రాల్లోనూ లిక్కర్‌ ఔట్‌లెట్లు, మద్యం వాకిన్‌షాప్‌(ఎలైట్‌ షాప్‌)ల ద్వారా మరింత అందుబాటులోకి తెచ్చింది. అంతటితో ఆగకుండా బార్లను బార్లా తెరిచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లు నిర్వహించాల్సి ఉండగా- కొందరు ఉదయాన్నే తెరచి అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పోటీపడి అధిక మొత్తానికి అనుమతి దక్కించుకున్న వ్యాపారులు.. లాభాలు రాబట్టుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకున్నారు. మద్యం, ఇసుకపై ప్రత్యేకంగా సెబ్‌ ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొన్నా.. వారిలో కొందరు నెల మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


నాలుగేళ్లలో రూ.5060 కోట్ల విక్రయాలు

గన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020-21లో రూ.1038 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా- 2023-24లో రూ. 1433 కోట్ల విలువైన సరకు అమ్ముడుపోయింది. నాలుగేళ్లలో మొత్తం రూ. 5060 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. అంటే.. ఎంత మంది శ్రమజీవులు ఈ మహమ్మారి బారిన పడ్డారో గణాంకాలే చెబుతున్నాయి. విక్రయిస్తున్న రకాలు నిరుపేదల ఆరోగ్యాన్ని హరింపజేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఎక్కడా చూడని, వినని కంపెనీలు అమ్ముతున్నా.. నాసిరకమని తెలిసినా.. మానలేకపోతున్నామని.. తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామన్న నిస్సహాయకత కొందరు వ్యక్తం చేస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.


రాత్రిళ్లు వీధుల్లోకి రావాలంటే భయం

- మస్తానమ్మ, నెల్లూరు

నేను నగరంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నా. రాత్రిళ్లు విధులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడ చూసినా రోడ్లపై మద్యం తాగుతున్న వారు కనిపిస్తుంటారు. కొన్నిసార్లు.. ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. తోటి సిబ్బంది తోడు ఉన్నప్పుడు పర్వాలేదు. వారు సెలవులో ఉన్నప్పుడు రోడ్డుపై వెళ్లాలంటే భయంగా ఉంటుంది. రోడ్లు, దుకాణాల ముందు కూర్చొని మద్యం తాగుతుంటే.. అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారో వారికే తెలియాలి.


సంపాదనలో సగం దానికే..

 - మంజుల, నెల్లూరు

వైకాపా అధికారంలోకి రాగానే మద్యం నిషేధిస్తామంటే సంతోషించాం. నా కుటుంబంలోని కొందరికీ మందు తాగే అలవాటు ఉంది. వారు రోజంతా సంపాదించిన దానిలో సగం తాగుడుకే ఖర్చు పెడుతున్నారు. దానికి తోడు తాగిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. గతంలో వారం మొత్తం పనికి వెళ్లేవారు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించక ఒకటి, రెండు రోజులు వెళ్లడం లేదు. ఇదంతా మద్యం వల్లే జరుగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని