logo

జగనన్నా.. ఈ ప్రాంగణాలేందన్నా!

ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు.

Published : 30 Apr 2024 04:34 IST

ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు. కానీ ఆచరణలో అమలుకావడం లేదు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు సౌకర్యాలు లేక నిత్యం యమయాతన పడుతున్నారు. దాహమేస్తే తాగేందుకు నీరు ఉండడం లేదు. కాసేపు కూర్చుందామంటే బెంచీలు కానరావు. ఇవి ఉంటే ఫ్యాన్లు ఉండవు. ఉన్నా తిరగవు. దీంతో వేసవిలో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వంలో విలీనమైనా ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు.

 న్యూస్‌టుడే బృందం


ముక్కులు మూసుకోవాల్సిందే!

నెల్లూరు:  నగరంలోని ప్రధాన ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు సరిపడా కుర్చీలు లేకపోవడంతో నేలపై కూర్చుంటున్నారు. తాగునీటి సదుపాయమూ అంతంతమాత్రమే.మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్వాసనతో ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడి నుంచి నిత్యం 250కి పైగా బస్సులు వెళుతుంటాయి. రోజుకు 50 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు.

విరిగిన కుర్చీలు

కందుకూరు పట్టణం : పట్టణంలోని డిపో పరిధిలో సుమారు 95 బస్సులు ఉండగా,  నిత్యం 8 వేల మంది  వస్తుంటారని అంచనా. వీరికి తాగేందుకు నీరు అందుబాటులో లేదు. కుళాయిల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దుకాణాలకు వెళితే నిలువు దోపిడీ చేస్తున్నారు. అర లీటరు మంచినీళ్ల డబ్బా రూ.15 వసూలు చేస్తున్నారు. కూర్చునే బల్లలు కొన్ని విరిగిపోయాయి.  

నీడ కరవు

దుత్తలూరు: వింజమూరు ఆర్టీసీˆ బస్టాండులో సేదదీరేందుకు వీల్లేదు. ఎండలో నిరీక్షించలేక సొమ్మసిల్లిపోతున్నారు. వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఉన్నా ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేకపోవడంతో నిలబడి నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో సమీపంలోని చెట్ల కింద సేద తీరుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్టాండులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  

ప్రయాణికులకు తప్పని కష్టాలు

తిరగని ఫ్యాన్లు

కావలి : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్యాన్లు ఉన్నా, కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. నీటికీ ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత మొత్తం చెల్లించి వినియోగించే మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. బస్టాండ్‌ పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. బస్టాండ్‌లో పైకప్పు పెచ్చులూడుతోంది. దీంతో ప్రయాణికులు ఇవి ఎక్కడ పైన పడతాయోనని ఆందోళన చెందుతున్నారు.

గుక్కెడు నీరూ కష్టమే!

ఆత్మకూరు : పట్టణంలోని పురపాలక బస్టాండ్‌లో వసతుల లేమి ప్రయాణికులను వేధిస్తోంది. తాగునీటి వసతి లేదు. ఈ బస్టాండ్‌ సముదాయంలో మరుగుదొడ్లు లేవు. ప్రయాణికులు అత్యవసర సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని సులభ్‌ కాంప్లెక్‌్్సలోకి వెళుతున్నారు. చలివేంద్రానికి వెళ్లి దాహం తీర్చుకుంటున్నారు.

తాగునీటికి ఇక్కట్లే: ప్రభాకర్‌రెడ్డి, ఆత్మకూరు

పురపాలక బస్టాండ్‌లో తాగునీటి వసతి లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నాం. గతంలో ఉన్న పాత బస్టాండ్‌లో మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ఉండేది. దీన్ని తొలగించారు. ప్రస్తుతం వసతి అందుబాటులోకి తేలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని