logo

రూ.18 కోట్లు ఖర్చు.. చుక్క నీరొస్తే ఒట్టు!

పాలకులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసిన పథకాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో వేసవిలో దప్పికతో ప్రజలు అలమటించిపోతున్నారు.

Published : 05 May 2024 03:48 IST

అల్లూరు, న్యూస్‌టుడే

ఓ.హెచ్‌.ఎస్‌.ఆర్‌ ట్యాంక్‌

పాలకులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసిన పథకాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో వేసవిలో దప్పికతో ప్రజలు అలమటించిపోతున్నారు. ఇదీ ఒకనాటి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన అల్లూరులో ఏర్పాటుచేసిన తాగునీటి పథకం పరిస్థితి. 1999లో తెదేపా ప్రభుత్వ హయాంలో మండలంలోని గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు పథకానికి రూపకల్పన చేసింది. ఇందుకు రూ.18 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు వేగంగా చేశారు.  

52 గ్రామాలకు నీరిచ్చేలా..

మండలంలోని 52 మంజరా గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేలా  అల్లూరులో స్టోరేజి ట్యాంక్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను నిర్మాణం చేశారు. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీన్ని వినియోగంలోకి తీసుకురావడంపై శ్రద్ధ చూపలేదు. ఒక్క గ్రామానికి తాగునీరు అందని దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పైపులైన్లు వేశారు. ఇవన్నీ ఎందుకూ పనికిరాకుండాపోయాయి.

ప్రజలకు తప్పని అవస్థలు

మండలంలో తీరప్రాంతం అధికంగా ఉండడంతో ఉప్పు నీరే లభ్యమవుతోంది. దీంతో తాగునీటికి దశాబ్దాలుగా పడుతున్న అవస్థలు తీరడం లేదు. చారిత్రక నేపథ్యం ఉన్న అల్లూరు చెరువు నుంచి సరఫరా అవుతోంది. ఇది సరిపోకపోవడంతో ఈ పథకాన్ని ఏర్పాటుచేశారు. ఇదేమో వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈసమయంలో అయినా దీని ద్వారా నీరు విడుదల చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని