logo

జగన్మాయ.. శ్రమజీవి కన్నీటి ఛాయ!

‘పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం’ అని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అదే పేదలను అయిదేళ్లుగా పీక్కుతిన్నారు. పొట్టకూటికి తెల్లవారుజామునే అడ్డా మీదకు చేరుకునే కూలీలను.. కేవలం ఓట్ల సమయంలో పనికొచ్చే యంత్రాలుగానే చూశారు.

Published : 05 May 2024 04:10 IST

అయిదేళ్లుగా భవ నిర్మాణ కార్మికులపై నిర్లక్ష్య వైఖరి
వైకాపా ఇసుక విధానంతో నిర్మాణ రంగం కుదేలు
ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

‘పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం’ అని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అదే పేదలను అయిదేళ్లుగా పీక్కుతిన్నారు. పొట్టకూటికి తెల్లవారుజామునే అడ్డా మీదకు చేరుకునే కూలీలను.. కేవలం ఓట్ల సమయంలో పనికొచ్చే యంత్రాలుగానే చూశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సరఫరా ఆపేసి.. ఆరు నెలలు నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేశారు. చివరకు వారి సంక్షేమాన్ని విస్మరించి.. శ్రమజీవుల బతుకులను మరింత ఛిద్రం చేశారు. వేలాది మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలు కళ్ల ముందే పేదరికంతో కుదేలవుతున్నా కనికరం చూపలేదు. చివరకు తెదేపా హయాంలో ఇచ్చే సంక్షేమ పథకాలనూ నిలిపివేసి.. ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సిన దుస్థితిని కల్పించారు. 

జిల్లాలో లక్షా యాభైవేల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు ఉండగా- సుమారు 75వేల మంది వరకు నమోదు చేసుకున్నట్లు సంఘం నాయకులు చెబుతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త విధానం పేరుతో రీచ్‌లు మూసేశారు. ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దాంతో భవనాలు, ఇళ్ల పనులన్నీ ఆగిపోవడంతో.. కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరవైంది. ఆ తర్వాత కొవిడ్‌ విజృంభణ, లాక్‌డౌన్‌తో వారికి మళ్లీ పని దూరమైంది. అలాంటి విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మిక కుటుంబాలు అప్పులపాలయ్యాయి. పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. వీరి కోసం ఉన్న సంక్షేమ బోర్డు సైతం.. పేరుకే పరిమితమైంది. ప్రమాదవశాత్తు మరణించినా.. శాశ్వత వైకల్యం ఏర్పడినా.. అనారోగ్యం బారిన పడిన కుటుంబాలను గాలికి వదిలేసింది. ప్రభుత్వం సైతం నిద్ర నటించడంతో.. ప్రయోజనాలు అందక వారికి జీవనం కష్టంగా మారింది. కార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టినా.. పట్టించుకోకుండా.. భవన నిర్మాణ కార్మికులపై అయిదేళ్లు అదే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది.

తెదేపా సాయం.. వైకాపా మోసం

సంక్షేమ పథకాల ప్రయోజనం పొందాలంటే కార్మికులు రూ. 50 సభ్యత్వ రుసుం, సంవత్సర చందా రూ. 12 చొప్పున అయిదేళ్లకు రూ.60.. మొత్తంగా 110 చెల్లించి పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నవారు.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.అయిదు లక్షలు(వైఎస్‌ఆర్‌ బీమా వర్తించని వారికి), ప్రమాదంలో 25 శాతం వైకల్యానికి రూ. 25వేలు, 46 శాతానికి రూ.50 వేలు, 50-75 శాతానికి రూ. లక్ష, శాశ్వత వైకల్యానికి రూ.అయిదు లక్షలు, సహజ మరణం పొందితే రూ.60వేలు(వైఎస్‌ఆర్‌ బీమా మినహా) ఆర్థిక సాయం అందుతుంది. అంత్యక్రియలు, కుటుంబంలో కుమార్తె వివాహ ఖర్చులు, ప్రసూతి సాయం కింద (రెండు కాన్పులకు) రూ.20 వేల తోడ్పాటు అందాల్సి ఉంది. తాత్కాలిక వైకల్యం, అనారోగ్యం బారినపడిన కార్మికులకు రోజుకు రూ. 200, నెలకు గరిష్ఠంగా రూ.3 వేల చొప్పున మూడు నెలలకు రూ.9వేలు వైద్య ఖర్చుల కింద చెల్లిస్తారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. వైఎస్‌ఆర్‌ బీమా, వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కింద లబ్ధి పొందిన వారికి ఈ పథకం కింద వచ్చే లబ్ధి వ్యత్యాసం మాత్రమే ఇస్తున్నారు. 2019కి ముందు లబ్ధిదారులకు సాయం అందినా.. ఆ తర్వాత సొమ్ములు రావడం నిలిచిపోయింది. జిల్లాలో దాదాపు రూ. 7 కోట్ల వరకు రావాల్సి ఉందని కార్మిక సంఘం నాయకులు చెబుతుండగా.. సాయం కోసం వేలాది మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు.

కొండాయపాళెం గేటు వద్ద నిరీక్షిస్తున్న భవన నిర్మాణ కార్మికులు

రూ.అయిదు వేలు ఒట్టిమాటే..

కరోనా మొదటి దశలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధుల నుంచి సాయం అందుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం కార్మికుల ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాల నమోదును మూడు నెలల్లోపు పూర్తి చేయాలని సూచించింది. ఈ పథకం కింద రూ.అయిదు వేల చొప్పున సాయం అందుతుందని ప్రచారం చేయడంతో.. వేలాది మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సాయం అందలేదు.


పనుల్లేక.. పస్తులుంటున్నాం

ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయి. ట్రక్కు రూ. 3వేలు పలుకుతోంది. దాంతో భవన నిర్మాణాలు చేసుకునేవారి సంఖ్య తగ్గింది. సిమెంట్‌, ఇనుము ధరలు కూడా అంతే.. ఫలితంగా పనులు లేక పస్తులు ఉంటున్నాం. కనీసం నెల రోజుల్లో.. పది రోజులు పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉంటున్నాం. బతుకు భారంగా మారింది. ఇసుక ఉచిత విధానం అమల్లోకి వస్తే.. మా పరిస్థితి మారుతుంది. 

సుబ్బారాయుడు, భవన నిర్మాణ మేస్త్రీ


సంక్షేమ బోర్డు నిర్వీర్యం

భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినడానికి వైకాపా ప్రభుత్వ నిర్ణయాలే కారణం. కార్మికులకు పనులు లేకుండా చేసింది. భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డులో సంక్షేమానికి రూ.1870 కోట్లు ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదు. వివిధ పథకాలకు వాటిని మళ్లిస్తున్నారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదు. కార్మికుల జీవనం దయనీయంగా మారింది.

పెంచల నరసయ్య, కార్మికుడు


వేలాది మంది ఎదురుచూపులు

అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదు. కార్మికులకు తీరని ద్రోహం చేసింది. జిల్లాలో దాదాపు 60 వేల మంది భవన నిర్మాణ కార్మికులు వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి అందక అవస్థలు పడుతున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. 

అల్లాడి గోపాల్‌, కార్మికసంఘం నాయకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని