logo

అంబటి చెప్పినా ఏదీ ఫలితం?

మెరుపు వరదలకు.. పెన్నానది పెట్టింది పేరు. దీనికి కుందు, సగిలేరు, చెయ్యేరు, గుంజనవాగు, పాపాఘ్ని, జయమంగళ, తీతా, బీరాపేరు, బొగ్గేరు తదితర వాగులు, ఉపనదులు ఉన్నాయి.

Published : 06 May 2024 05:49 IST

బాగుపడని పెన్నా పొర్లుకట్ట

సంగం బ్యారేజీ దిగువన ధ్వంసమైన పొర్లుకట్ట

మెరుపు వరదలకు.. పెన్నానది పెట్టింది పేరు. దీనికి కుందు, సగిలేరు, చెయ్యేరు, గుంజనవాగు, పాపాఘ్ని, జయమంగళ, తీతా, బీరాపేరు, బొగ్గేరు తదితర వాగులు, ఉపనదులు ఉన్నాయి. వాటి పరిధిలో ఏ మాత్రం భారీ వర్షాలు వచ్చినా.. పొంగి పొర్లి పెన్నాలోకి చేరుతుంటాయి. దాంతో మెరుపు వేగంతో వరదలు వస్తున్నాయి.

సంగం, న్యూస్‌టుడే: సంగం బ్యారేజీకి దిగువన అత్యంత సమీపంలో పెన్నానది గట్టు 2021 నవంబరులో పూర్తిగా ధ్వంసమైంది. నాటి నుంచి అక్కడ మరమ్మతులు చేయలేదు. పటిష్ఠపరిచే చర్యలు చేపట్టలేదు. 2022 మే, తొమ్మిదో తేదీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించి.. వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. ఇప్పటికీ అమలు కాలేదు. దీంతో మెరుపు వరదలకు పేరొందిన పెన్నాకు.. ఆకస్మికంగా భారీ వరద ప్రవాహం వస్తే ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

5.5 లక్షల క్యూసెక్కుల భారీ వరదతో..

నవంబరు 19, 2021 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ ఉదయం వరకు సంగం ఆనకట్ట మీదుగా పెన్నానదిలో 5.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. ఆ క్రమంలో దిగువ గట్టు దాటి.. సమీప ప్రాంతాలను ముంచెత్తింది. నాడు గట్టు మరింత కోతకు గురై ఉంటే.. సంగంతో పాటు బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాలకు తీవ్ర ప్రమాదం వాటిల్లేది. బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు సమీపంలో పొర్లుకట్టకు గండిపడి.. వరద ప్రవాహం వెనక్కు మళ్లడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 2022 మే నెలలో.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సంగం బ్యారేజీ సందర్శనకు రాగా.. సంగం వాసులు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. తిరిగి అలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికీ అతీగతీ లేదు. పొర్లుకట్ట పటిష్ఠం చేసేందుకు రూ. 66 లక్షలతో తెలుగుగంగ విభాగం అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినా.. ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు.

బ్యారేజీలో నీటి నిల్వతో..

1885 నుంచి గత ఏడాది సెప్టెంబరు వరకు పెన్నానదికి భారీ వరదలు వస్తే.. 1242 మీటర్ల పొడవైన సంగం ఆనకట్టను దాటుకుని సులువుగా దిగువకు వెళుతుండేవి. ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. ఇప్పుడు బ్యారేజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఒకేసారి వరద దిగువకు వెళ్లాలంటే సాధ్యం కాదు. 85 గేట్ల నియంత్రణపైనే ఆధారపడి ఉంటుంది. సోమశిల జలాశయం నుంచి వరద ప్రవాహం వస్తే.. ముందుగా సమాచారం అందుతుంది. అందుకు అనుగుణంగా సంగం వద్ద గేట్లు తెరిచేందుకు వీలవుతుంది. సంగం వద్ద బీరాపేరు, బొగ్గేరు వాగులు ఏటా ఉద్ధృతంగా వరదను తెస్తుంటాయి. వీటికి ముందస్తు సమాచారం ఉండదు. అలాంటప్పుడు ఇక్కడ బ్యారేజీ గేట్ల నియంత్రణలో జాప్యం జరిగి.. వరద ప్రవాహం వెనక్కు వెళితే ఇబ్బంది తలెత్తుతుంది. ఈ ప్రాంతంలో పొర్లుకట్ట ఉనికి కోల్పోయింది.


ప్రమాదకరంగా..  

ఊట్ల బాబు : పెన్నా పొర్లుకట్ట ధ్వంసమైనా.. ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు.  ప్రమాదకరంగా ఉంది. ఇప్పటికైనా నిర్మించాలి.


నిరుపేద ఎస్సీల పొలాలు

ఒ.మస్తాన్‌ : బ్యారేజీకి దిగువన నిరుపేద ఎస్సీల పొలాలు ఉన్నాయి. పొర్లుకట్టకు గండి పడితే.. అవి ఎందుకూ పనికి రావు. వెంటనే దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతులు చేయించాలి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని