logo

భూ భక్షణ చట్టం

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అరాచక చట్టం కొత్తకష్టాలు తెచ్చిపెట్టింది. ఆక్రమణలకు పట్టం కట్టేలా ఉంది. మున్ముందు భూ రక్షణకు, ఆస్తుల భద్రతకు చెల్లుచీటి పలికే దీన్ని ఊహించుకుంటేనే భయానకం.

Updated : 07 May 2024 05:03 IST

న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం, నెల్లూరు (లీగల్‌), (స్టోన్‌హౌస్‌పేట), ఉదయగిరి

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అరాచక చట్టం కొత్తకష్టాలు తెచ్చిపెట్టింది. ఆక్రమణలకు పట్టం కట్టేలా ఉంది. మున్ముందు భూ రక్షణకు, ఆస్తుల భద్రతకు చెల్లుచీటి పలికే దీన్ని ఊహించుకుంటేనే భయానకం. రాబందుల రాజ్యంలో సామాన్యులకు భూ హక్కు ప్రశ్నార్థకమే. నిరక్షరాస్యులు, చిన్న-సన్నకారు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఎవరివైనా ఆస్తులు కబ్జాకు గురైతే.. తామే యజమానులమని నిరూపించుకునేందుకు పరీక్ష పెట్టిందీ వైకాపా సర్కారు.

‘వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం లోప భూయిష్టంగా ఉంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఈ చట్టంతో ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని’ పలువురు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇది రైతులకు ఇబ్బందికరమైన చట్టమనీ, ఈ చట్టంతో భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రజలు తమకు తెలియకుండానే వారి ఆస్తులు కోల్పోయే ప్రమాదం ఉందనీ, దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గతంలో తాము ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు.

చట్టబద్ధత లేని అంశాలే ఎక్కువ

-సీహెచ్‌ హరికృష్ణ, న్యాయవాది

భూ యాజమాన్య హక్కుల చట్టం లొసుగులమయంగా ఉంది. విచారణ అధికారాన్ని సివిల్‌ కోర్టుల నుంచి తప్పించి టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారికి అప్పగించడం వివాదాలకు దారితీస్తోంది. చట్టంలో ఉన్న పరిపాలన విధానం చాలా తప్పుగా ఉంది. చట్టబద్ధత లేని అంశాలే ఈ చట్టంలో ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్‌ యాక్టును దృష్టిలో పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఈ చట్టాన్ని తయారు చేశారు. దీంతో వ్యక్తుల ఆస్తులకు విఘాతం కలుగుతోంది.


అభూత కల్పన చట్టమిది

-పి.భాస్కర్‌రావు, న్యాయవాది

ప్రభుత్వం తీసుకొచ్చింది అభూత కల్పన చట్టం. రాష్ట్రంలో చాలా కోర్టులు, న్యాయవాదులు, న్యాయమూర్తులున్నారు. అంతమంది ఉన్నా.. భూ సమస్యలను కేవలం రెవెన్యూ అధికారులతో పరిష్కరిస్తామనీ, ఈ చట్టాన్ని తీసుకురావడం దారుణం. క్రయవిక్రయాల అనంతరం రికార్డుల్లో ఎవరి పేరుందో రెండు సంవత్సరాల్లోగా తెలుసుకోకపోతే ఆస్తి కోల్పోయినట్లే. ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కింది కోర్టులకు వెళ్లడానికే కక్షిదారులకు ఇబ్బందిగా ఉంటే.. ఇక హైకోర్టుకు వెళ్లాలనడం దారుణం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం అమలు చేయకూడదు. దీన్ని అమలు చేయకుండా హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాం.


ఆస్తులు కోల్పోతారు

-వలేటి శ్రీధర్‌నాయుడు, న్యాయవాది

టైటిలింగ్‌ యాక్టు వల్ల స్థిరాస్తులను ప్రజల నుంచి దూరం చేయడమే అవుతుంది. టైటిలింగ్‌ అధికారాన్ని అధికారుల చేతికిస్తే.. అధికార పార్టీ నాయకులకే పెత్తనం అప్పగించడం అవుతుంది. అప్పుడు కేవలం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే న్యాయం జరుగుతుంది. చట్టం అమలైతే భూ సమస్యలున్న వారు న్యాయస్థానాలకు వెళ్లినా సరైన న్యాయం జరగకపోవచ్చు. ఈ చట్టం రద్దు చేస్తేనే సామాన్యులకు మేలు జరుగుతుంది. ఈ చట్టాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.


చిన్న, సన్నకారు రైతులకు సాధ్యమా?

-ఆర్‌.రమేష్‌, న్యాయవాది

ఈ చట్టం ద్వారా రిజిష్టర్‌లో ఒకసారి భూహక్కు దారుని పేరు నమోదైన తరువాత ఈ భూములపై ఎవ్వరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబోయే, జిల్లా ట్రైబ్యునల్స్‌లోనే తేల్చుకోవాల్సి ఉంది. జిల్లా ట్రైబ్యునల్‌లో న్యాయం జరగలేదనుకున్నప్పుడు తీర్పు వెలువడిన 15రోజుల్లో రాష్ట్ర స్థాయి ట్రైబ్యునల్‌లో అప్పీలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత హైకోర్టులో భూహక్కును నిర్ధారించుకోవాల్సి వస్తుందని ఈ చట్టం చెబుతోంది. ఇది చిన్న, సన్నకారు, దళిత, బీసీ వర్గాల ప్రజలకు ఆచరణ సాధ్యంకాదు.


అధికార పార్టీ చెప్పుచేతల్లోనే..

-ఎస్‌కె.రియాజ్‌బాషా, న్యాయవాది

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ద్వారా రికార్డు సృష్టించడానికి, అధికారం కేవలం టైటిలింగ్‌ అధికారి చేతుల్లోనే ఉంటుంది. తద్వారా గత రికార్డులకు సంబంధించి సాక్ష్యంగా ఉన్న విలువలను రద్దు చేస్తుంది. పనికిమాలిన వివాదాలను సృష్టిస్తూ నిజమైన భూహక్కు దారులను హింసించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. చట్టం వల్ల భూహక్కుదారులకు నష్టం జరిగి, అధికార పార్టీ రాజకీయ దళారి కబ్జాదారులు, సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఆగడాలకు హద్దు, అదుపు ఉండదు.


చర్చే లేకుండా అమలా!

-కె.వి.లక్ష్మీనారాయణ, న్యాయవాది

చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు రాష్ట్రంలోని మేధావులు, న్యాయ నిపుణులతో కనీసం ఒక సెమినార్‌ నిర్వహించలేదు. కేంద్ర ప్రభుత్వంపై నెపం పెడుతున్నారు. కానీ, వారు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌ తర్వాత మన రాష్ట్రంలోనే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ చట్టంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటే వారిని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. అధికార పార్టీకి మద్దతు తెలిపే న్యాయవాదులు కూడా ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారసత్వాన్ని అధికారులే నిర్ణయించడం దారుణం.


చట్టం.. లోపభూయిష్టం

-ఎస్‌ రామారావు, న్యాయవాది, ఉదయగిరి

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం లోపభూయిష్టంగా ఉంది. దీన్ని అమలు చేస్తే సివిల్‌ కోర్టులు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా భూములకు సంబంధించిన వ్యవహారమంతా టీఆర్‌వో వద్దనే ఉంటాయి. చివరికి సదరు భూయజమానులకు ఒక జెరాక్సు కాపీలు మాత్రమే చేతిలో ఉంటుంది. వారసత్వ ఆస్తిని కూడా సరైన సమయంలోగా యజమాని తన పేరుతో నమోదు చేసుకోవాలి. లేకుంటే ఆ భూమిని ప్రభుత్వమే లాక్కునే ప్రమాదం ఉంది. అలాగే భూయజమాని రెండేళ్ల లోపు ఆ భూమి తమదేనని నిరూపించుకోకుంటే కోల్పోయే పరిస్థితి భూహక్కు చట్టంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని