logo

అయిదేళ్ల పాలన.. ఆటలకేదీ ఆలన?

క్రీడాకారులకు జిల్లా పెట్టింది పేరు.. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వైకాపా ప్రభుత్వ పుణ్యమాని క్రీడాభివృద్ధికి ఎలాంటి పథకాలు అందజేయలేదు.

Published : 08 May 2024 06:46 IST

వైకాపా ప్రభుత్వంలో ఒక్క పథకమూ లేదు..
క్రీడా భవితను కోల్పోయిన క్రీడాకారులు
న్యూస్‌టుడే, నెల్లూరు (క్రీడా విభాగం)

క్రీడాకారులకు జిల్లా పెట్టింది పేరు.. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వైకాపా ప్రభుత్వ పుణ్యమాని క్రీడాభివృద్ధికి ఎలాంటి పథకాలు అందజేయలేదు. ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. గత ప్రభుత్వం క్రీడాకారుల కోసం ‘డే బార్డర్‌’, ‘గాంఢీవం’, ‘పాంచజన్య’ వంటి పథకాలు ప్రవేశపెట్టి పాఠశాల స్థాయి నుంచే క్రీడలను అభివృద్ధి చేసింది. వైకాపా ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. క్రీడా వికాస కేంద్రాలు, అకాడమీలు, మైదానాలు.. ఇలా ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అయిదేళ్లలో జిల్లాలో క్రీడల పరంగా ఒరిగిందేమి లేదు.

పూరించని పాంచజన్యం..

ఒలింపిక్స్‌లో రాష్ట్రం తరఫున క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో అర్జునుడి విల్లు ‘గాంఢీవం’ పేరుతో వినూత్న పథకం, ఆర్థికంగా క్రీడలకు దూరమవుతున్న వారిని గుర్తించి వారికి మంచి పౌష్టికాహారంతో పాటు నిపుణులచే ఉచితంగా శిక్షణ ఇచ్చేలా ‘డే బార్డర్‌’, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా చేసేందుకు ‘పాంచజన్య’ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. పాఠశాలల వారీగా క్రీడాకారులను ఎంపిక చేసి వారిని నైపుణ్యాలు కలిగిన శిక్షకులతో శిక్షణ ఇప్పించే వారు. ఇలా నియోజకవర్గాల వారీగా పాఠశాలలను ఎంపిక చేసేవారు. దాంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని గుర్తించి వారికి ప్రతి నెలా ఆర్థిక సాయం చేసేవారు. రాష్ట్రంలో మంచి పేరున్న శిక్షకులతో శిక్షణ ఇప్పించేవారు. అయిదేళ్లలో క్రీడాకారులకు అవసరమైన ఇలాంటి ఒక్క పథకం అమలు చేయలేదు.

ప్రభుత్వంలో పే అండ్‌ ప్లే..

మైదానంలో ఆడేందుకు ప్రభుత్వం పే అండ్‌ ప్లే అనే నినాదాన్ని ప్రవేశపెట్టింది. దీంతో చాలా మంది క్రీడాకారులు క్రీడలకు దూరమయ్యారు. గత ప్రభుత్వంలో కేవలం స్విమ్మింగ్‌ ఫూల్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడల నిర్వహణకు నామమాత్రపు రుసుము వసూలు చేసేది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మైదానానికే రుసుం వసూలు చేస్తోంది. ఒక్కో క్రీడాకారుని వద్ద క్రీడను బట్టి రుసుము వసూలు చేస్తున్నారు. మైదానంలో ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, వాలీబాల్‌ తదితరాలు క్రీడలు ఆడాలంటే రుసుము చెల్లించాల్సిందే.

దిష్టిబొమ్మలా క్రీడా వికాస కేంద్రాలు..

గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రాలు.. ఒక్కటీ ప్రారంభానికి నోచుకోలేదు. నియోజకవర్గానికి ఒకటి క్రీడా మైదానం చొప్పున నాటి ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. స్థల సేకరణ జరిగింది. పూర్తయితే నియోజకవర్గాల వారీగా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చేవారు. ఉమ్మడి జిల్లాకు పది కేవీకేలు మంజూరయ్యాయి. ఒక్కటీ ప్రారంభానికి నోచుకోలేదు.


అకాడమీలేవీ..?

క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణతో పాటు పౌష్టికాహారం అందిస్తూ పోటీలకు సిద్ధం చేసే అకాడమీలు అయిదేళ్లలో ఒక్కటీ లేదు. క్రీడాపరంగా అభివృద్ధి చెందిన జిల్లా జిల్లాకు అకాడమీలు కేటాయించకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో ఆరు అకాడమీలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించారు. దాంతోపాటు బాలికల కోసం రూ.2కోటË్లతో నిర్మించతలపెట్టిన భవనం నేటికీ పూర్తి కాలేదు. ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం ఆవరణంలో దీన్ని ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది.


ప్రారంభానికి దూరం.. మొగళ్లపాలెం ఇండోర్‌ స్టేడియం

రూ.8 కోట్లతో నెల్లూరు గ్రామీణం మొగళ్లపాలెంలో నిర్మించిన బహుళ ఇండోర్‌ మైదానం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 150 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 2018లో పనులు ప్రారంభించారు. సుదీర్ఘ కాలం అనంతరం గత ఏడాది పనులు పూర్తయినట్లు ప్రకటించినా.. ఇంత వరకు క్రీడాకారులకు  అందుబాటులోకి తీసుకురాలేదు.


ఏళ్లుగా ప్రతిపాదనలు

ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం

జిల్లాకే తలమానికమైన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం అభివృద్ధికి ఏళ్ల నుంచి ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయి. అయిదేళ్ల నుంచి మైదానానికి అవసరమైన అన్ని రకాల ప్రతిపాదనలు అధికారులు నివేదిస్తున్నా.. నేటికి ఒక్కటీ మంజూరు కాలేదు. సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జూడో తదితర 12 క్రీడాంశాలకు సంబంధించి మైదానాలు ఉన్నాయి. వీటికి కావల్సిన వసతులు లేవు. హాకీ మైదానానికి సంబంధించి ఫెన్సింగ్‌ కావాలని అధికారులు వేడుకుంటున్నా.. మంజూరు చేయలేదు. దాంతో పాటు ప్రతి క్రీడా మైదానానికి క్రీడాకారుల కోసం డ్రస్సింగ్‌ రూమ్‌ కావాలని నివేదించారు. దాని ఊసే లేదు. ఇక స్కేటింగ్‌ క్రీడకు సంబంధించి రింక్‌ కావాలని దరఖాస్తులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో క్రీడాకారులు తీవ్ర నష్టపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు