logo

వడదెబ్బకు తల్లీతనయుడి మృతి

నిరుపేద కుటుంబం...సరైన పోషణ లేదు. ఆపై వృద్ధాప్యం నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఇంటిలోనే తల్లీతనయులు ఒకేసారి మృతిచెందారు. ఈ సంఘటన దువ్వూరు గ్రామంలో వెలుగుచూసింది. ఎవరూ గుర్తించకపోవటంతో వారి మృతదేహాలు మూడు రోజులపాటు ఇంటిలోనే ఉన్నాయి.

Published : 09 May 2024 05:29 IST

సంగం, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబం...సరైన పోషణ లేదు. ఆపై వృద్ధాప్యం నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఇంటిలోనే తల్లీతనయులు ఒకేసారి మృతిచెందారు. ఈ సంఘటన దువ్వూరు గ్రామంలో వెలుగుచూసింది. ఎవరూ గుర్తించకపోవటంతో వారి మృతదేహాలు మూడు రోజులపాటు ఇంటిలోనే ఉన్నాయి. గ్రామానికి చెందిన రమణమ్మ(80), తన కుమారుడు అవివాహితుడైన శ్రీనివాసులురెడ్డి(60)తో కలసి నివసిస్తున్నారు. దువ్వూరు- మక్తాపురం రహదారి సమీపంలో వారి నివాసగృహం ఉంది. వయోభారానికి తోడు వారికి సరైన పోషణ లేదు. దాంతో వారిద్దరూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు. మూడు రోజులుగా వారు ఎవరికీ కనిపించలేదు. ఎండ తీవ్రత కారణంగా ఎవరూ గమనించలేదు. మంగళవారం రాత్రి వారింటిలో దీపం వెలగనందున చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా వారిద్దరూ మృతి చెందినట్లు కనుగొన్నారు. మృతదేహాల తీరుతెన్నులను గమనించిన గ్రామస్థులు తొలుత శ్రీనివాసులురెడ్డి, ఆ తరువాత ఆయన తల్లి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. తనయుడి మృతదేహం వద్ద ఆమె పడిపోయి ఉంది. ఆమె చేతిలో బియ్యం ఉన్నాయి. కుమారుడు మృతి చెందారని తెలుసుకున్న ఆమె ఆయన కళ్లు కప్పేందుకు బియ్యం తీసుకు వచ్చి తాను కూడా ఊపిరి వదిలినట్లు భావిస్తున్నారు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. బుధవారం వారిద్దరి అంత్యక్రియలను బంధువులు ఒకేసారి నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని