logo

అసౌకర్యాల కొండ

మండల కేంద్రమైన కొండాపురం వార్డుల్లో మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు పేరుకుపోయాయి. వైకాపా ప్రభుత్వ కాలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కారం మార్గం చూపలేదని పంచాయతీ ప్రజలు విమర్శిస్తున్నారు.

Published : 09 May 2024 05:35 IST

బీసీ కాలనీలో అధ్వానంగా మురుగు వ్యవస్థ

కొండాపురం, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన కొండాపురం వార్డుల్లో మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు పేరుకుపోయాయి. వైకాపా ప్రభుత్వ కాలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కారం మార్గం చూపలేదని పంచాయతీ ప్రజలు విమర్శిస్తున్నారు. పలు సమావేశాలు నిర్వహించిన కనీసం చర్చించలేదనే విమర్శలున్నాయి. పంచాయతీ పరిధి 10వ వార్డులో అయిదేళ్లుగా సమస్యలతో స్థానికులు అవస్థ పడుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవటంలేదని బీసీ కాలనీ వాసులు తెలిపారు.  ్న బీసీ కాలనీలో మురుగు బయటకు వెళ్లేందుకు మార్గం లేదు. దీంతో ఇళ్ల ముందు నిలిచి పరిసరాలు దుర్గంధం  వెదజల్లుతున్నాయి. దీంతో అనారోగ్య కారణాలతో స్థానికులు ఆసుపత్రుల పాలవుతున్నారు. మురుగు కాల్వలు ఏర్పాటు చేసి ఆ నీరు గ్రామం బయటకు వెళ్లేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ్న ఆరో వార్డు ఎస్టీ కాలనీలో గతంలో సీసీరోడ్లు నాసిరకంగా నిర్మించారు. అవి నేడు పగుళ్లుబారి, రోడ్డు గుంతలు మెట్టలుగా అధ్వానంగా కనిపిస్తున్నాయి. మరమ్మతులు చేయాలని పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఒక్కరూ స్పందించలేదని కాలనీవాసులు చెబుతున్నారు.

ఎస్టీకాలనీలోని పగిలిపోయిన సీసీ రోడ్లు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. అందాల్సిన సేవలు పూర్తిగా అందక, అభివృద్ధికి నోచుకోక అధ్వానపరిస్థితి నెలకొంది. చెల్లించాల్సిన పన్నుల భారం తడిసి మోపెడవుతోంది. 1987కు ముందు కందుకూరు పంచాయతీగా ఉండేది. అప్పట్లో కందుకూరును నగర పంచాయతీగా అభివృద్ధి చేసేందుకు చుట్టుపక్కల గ్రామాలైన దివివారిపాలెం, చుట్టుగుంట, ఆనందాపురం, శ్యామీర్‌పాలెం, కండ్రావారిపాలెం గ్రామాలను నగర పంచాయతీగా ఏర్పాటుచేశారు. 2001లో గ్రేడ్‌-2 మున్సిపాలిటీగా మార్చారు. 2005లో ఆయా గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించి ఆనందాపురం, దివివారిపాలెం పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఆ గ్రామాలు లేకుండానే 2007లో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించారు. తొలగించిన గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని 2010లో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. 2014లో రాష్ట్రమంతటా మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలు జరిగినా కందుకూరు మున్సిపాలిటీకి జరగలేదు. 2016లో కోర్టు తీర్పు మేరకు 2017లో గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో అప్పటి నుంచి మున్సిపాలిటీలో అంతర్భాగంగా ఉన్నాయి. దివివారిపాలెం, గనిగుంట, చుట్టుగుంట, కండ్రావారిపాలెంను 10వ వార్డుగా, ఆనందాపురం, శ్యామీర్‌పాలెంను 11వ వార్డుగా ఏర్పాటుచేశారు. గడిచిన అయిదేళ్లలో రోడ్లు, కాలువలు ఏర్పాటు చేసిన దాఖలాల్లేవు. పారిశుద్ధ్య సమస్యలు వేధిస్తున్నాయి. శ్యామీర్‌పాలెంలో రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీరు సరఫరా అవుతోంది. కందుకూరు-చుట్టుగుంట, కందుకూరు-దివివారిపాలెం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ గ్రామాలు 2002 నుంచి 2017 వరకు పంచాయతీలుగా ఉన్నా.. ఆ కాలానీకి కూడా మున్సిపాలిటీకి పన్నులు చెల్లించాలని వాటితోపాటు జరిమానాలు కూడా విధించారు.

అధ్వానంగా కందుకూరు - దివివారిపాలెం రోడ్డు


పరిష్కరించడం లేదు

మా గ్రామం 15 ఏళ్లు పంచాయతీగా ఉన్న కాలానికి కూడా  పన్నులు వేయడం దారుణం. మాది పెంకుటిల్లు. రూ.1.6 లక్షలు పన్ను చెల్లించమన్నారు. అడిగితే పునఃపరిశీలిస్తామన్నారు. ఇంతవరకు జరగలేదు. రోడ్డు అధ్వానంగా ఉంది. మా ఊరి నుంచి చుట్టుగుంట వెళ్లే రోడ్డు పరిస్థితి చెప్పనవసరం లేదు.

పి.శివప్రసాద్‌, దివివారిపాలెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని