logo

‘సారాజ్యంలో’ సమిధలు

నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి అతిగా మద్యం తాగడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. చివరకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళితే.. కాలేయ మార్పిడి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.

Published : 09 May 2024 05:57 IST

ఓట్లకు.. మద్యంతో గాలం
ఎన్నికల వేళ నాసిరకం వెల్లువ
నిషా వలయంలో బడుగుల జీవితాలు
ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, జీజీహెచ్‌, ఆత్మకూరు, న్యూస్‌టుడే

నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి అతిగా మద్యం తాగడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. చివరకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళితే.. కాలేయ మార్పిడి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. అందుకు రూ. 60 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో.. బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

నా భర్త పేరు శ్రీనివాసరావు.. తాగుడు అలవాటుంది. మూడేళ్లుగా తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. పొట్ట ఉబ్బిపోతోంది. తీవ్రమైన కడుపు నొప్పితో సతమతమవుతున్నారు. ఆకలి ఉండటం లేదు. రెండేళ్లుగా ఏ పనీ చేయలేకపోతున్నారు. కాలేయం దెబ్బతిందని వైద్యులు చెప్పారు. మద్యం తాగినా అంతకు ముందెప్పుడూ ఇంతటి తీవ్ర అనారోగ్యం ఏర్పడలేదని కందుకూరుకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం ఎరగా వేయడానికి కొందరు యత్నిస్తున్నారు. కర్ణాటక, గోవాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పెద్దఎత్తున నిల్వ ఉంచుతున్నారు. అలాంటి వాటిలో ఊరూ పేరు లేని కంపెనీలు.. నాసిరకానివే అధికంగా ఉంటున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 2014లో కొందరు నాయకులు ఇతర ప్రాంతాల నుంచి నాసిరకం మందు తెచ్చి ఓటర్లకు పోయడంతో కొందరు చనిపోగా.. చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు నాణ్యత లేని మద్యాన్నే తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 18,478 సీసాలు స్వాధీనం చేసుకోగా.. అందులో పది వేల సీసాలు పొరుగు రాష్ట్రాలవే కావడం గమనార్హం.

జిల్లాలో మద్యం మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దాని కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిత్యం పదుల సంఖ్యలో బాధితులు నెల్లూరు సర్వజన ఆసుపత్రికి వరుస కడుతున్నారు. తాగే అలవాటు కొన్నేళ్లుగా ఉన్నా.. ఇంతటి తీవ్ర అనారోగ్య సమస్యలు మునుపెన్నడూ లేవని బాధితులు, వారి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నాసిరకం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. పైగా బాధితుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాలు, పేదలే.. వీరు రోజు కూలీలుగా చేస్తూ.. తమకు వచ్చే ఆదాయంలో సగానికిపైగా మందుకే వెచ్చిస్తున్నారు. ఇళ్లు.. ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. మంచానికే పరిమితమైపోయి.. అంతకు ముందులా ఏ పనీ చేసుకోలేకపోతున్నారు. నెలల వ్యవధిలోనే ఆరోగ్యం క్షీణించి కొందరు ప్రాణాలపైకి తెచ్చుకుంటుండగా.. వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడుతున్నారు. బాధితుల్లో యువత కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరు మొదట్లో సరదాగా మొదలుపెట్టి.. తర్వాత బానిసలైపోతున్నారు. ఆ మత్తూ చాలక గంజాయి వంటి మాదకద్రవ్యాల వైపు మళ్లుతున్నారు. కాగా, జిల్లాలో ప్రతి నెలా సుమారు రూ. వంద కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతుండటం గమనార్హం.

నాలుగేళ్లలో రూ.5060 కోట్లు

జిల్లాలో 193 మద్యం దుకాణాలు, 45 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉండగా- మద్యపాన నిషేధం అని చెప్పిన ప్రభుత్వం.. అయిదేళ్లలో ఆ దిశగా అడుగులు వేయలేదు. పైగా నిబంధనలు పక్కకు తోసి.. 24 గంటలు అందుబాటులో ఉంచింది. 2020-21లో రూ. 1038 కోట్ల విలువైన విక్రయాలు జరగ్గా.. 2023-24లో రూ.1433 కోట్ల మద్యం అమ్ముడైంది. నాలుగేళ్లలో మొత్తంగా రూ.5060 కోట్ల విలువైన సరకు విక్రయించారు. అంటే.. శ్రమజీవులు ఎంతలా మందుకు అలవాటుపడ్డారో ఈ గణాంకాలే చెబుతున్నాయి. గతంలో ఎక్కడా చూడని, వినని కంపెనీలవి అమ్ముతున్నా.. నాసిరకం అన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నా.. మానలేకపోతున్నామని.. ఆ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని కొందరు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

 

కాలేయం దెబ్బతినడంతో...

తాగుడు అలవాటు ఉన్నవారికి కాలేయం దెబ్బతింటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 50 శాతం దెబ్బతినే వరకు వ్యాధి లక్షణాలు బయట పడకపోవడంతో.. తాము ఎంత తాగినా ఏమీ కాదన్న భరోసాతో చాలా మంది ఉంటున్నారని.. అది ఎంత మాత్రం తగదని అంటున్నారు. ఆ క్రమంలో బాధితుల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయి.. పలు రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని పేర్కొంటున్నారు. మూత్ర సంబంధిత సమస్యలు, కడుపునొప్పి, పొట్ట ఉబ్బిపోవడం, కామెర్లు, కాళ్ల వాపులతో పాటు కొందరికి మూత్రపిండాలు దెబ్బతింటున్నాయన్నారు. మద్యం వ్యసనం కారణంగా కొందరు కాలేయ క్యాన్సర్‌కు గురైతే.. మరికొందరు మెదడు దెబ్బతిని చనిపోతున్నారని హెచ్చరించారు. ఇలా అనేక రకాల వ్యాధులకు గురవుతుండటంతో.. ముందుకు బానిసలైనవారు కోలుకోవడం కష్టంగా మారుతోందని చెబుతున్నారు.

కుటుంబ పరిస్థితులు తలకిందులు

నెల్లూరు జీజీహెచ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. బాధితులను ఐసీయూలో ఉంచితే నిత్యం రూ. పది వేలకుపైగా ఖర్చవుతోంది. కాలేయం పూర్తిగా చెడిపోతే.. దాన్ని మార్చేందుకు రూ. 30 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఖర్చవుతోంది. రోజుల తరబడి ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న నేపథ్యంలో వారి పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి.


ఆరోగ్యానికి హానికరం

మద్యం ఆరోగ్యానికి హానికరం. అది ఏ రకమైనదైనా కావచ్చు. ఇక కల్తీదైతే.. త్వరగా మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది. నరాల బలహీనతతో పాటు కాలేయం దెబ్బతింటుంది. సిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌ అనే ప్రమాదకర వ్యాధికి గురవుతారు. క్లోమ గ్రంథిÅ.. అనంతరం అంతస్రావక గ్రంథులు పాడై.. చివరకు ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. కుటుంబం వీధిన పడే ప్రమాదం ఉంది.

డాక్టర్‌ వై.గంగాధర్‌, ఫిజిషియన్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌


చిన్న మెదడుపై ప్రభావం

మద్యం దీర్ఘకాలికంగా తాగినా, అప్పుడప్పుడు తీసుకున్నా నష్టమే. దాని ప్రభావం చిన్న మెదడుపై నేరుగా పడుతుంది. స్థిమితం కోల్పోతారు. మెదడు, కాలేయం తర్వాత.. దాని ప్రభావం గుండె మీద పడుతుంది. అతిగా మద్యం తాగిన వారికే ఎక్కువ గుండెపోట్లు వస్తున్నాయి. జ్ఞాపకాలు కోల్పోవడం, సమయం సందర్భం లేకుండా మాట్లాడటం, పొంతన లేని మాటలు, పిచ్చి కూడా ముదురుతుంది. ఆల్కాహాల్‌ క్యాన్సర్‌ కారకం కూడా. వెన్నెముక దెబ్బతింటుంది. చివరకు నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది.

డాక్టర్‌ ఎం.నరేంద్ర, ఫ్రొఫెసర్‌, మెడిసిన్‌


నాసిరకం మద్యం వల్లే.. నా కుమారుడి మృతి

నా కుమారుడు రావూరు వెంకటేశ్వర్లుకు 44 ఏళ్లు. బీఏ బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీకి సన్నద్ధమవుతూ ఉన్నాడు. పోస్టులు విడుదల కాకపోవడానికి తోడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పనులకు వెళ్లడం ప్రారంభించాడు. ఆ క్రమంలో మద్యం అలవాటైంది. ఎన్నిసార్లు చెప్పినా దాన్ని వదల్లేకపోయాడు. తాగకపోతే వణికిపోయేవాడు. ఓ రోజు అన్నం తింటూనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళితే చనిపోయాడని చెప్పారు. చేతికందిన కొడుకు మద్యం మహమ్మారి కారణంగా అర్ధంతరంగా దూరమయ్యాడు.

లక్షమ్మ, ఆత్మకూరు


మూడు వారాలు ఆసుపత్రిలో శ్రీవాణి

మా ఆయన కూలీ పనులకు వెళతాడు. తాగుడు వల్ల ఇంట్లో రోజూ గొడవలే. ఈ మధ్య అనారోగ్య సమస్యలు.. ముఖ్యంగా కడుపు నొప్పి వస్తోంది. గతం కంటే తాగుడూ ఎక్కువైంది. కూలీ డబ్బు ఇంట్లో కూడా ఇవ్వకుండా మందుకే తగలేస్తున్నాడు. ఇటీవల మూడు వారాల పాటు ఆసుపత్రిలో చేర్చాం. నాసిరకం మందు తాగడం వల్లే కడుపునొప్పి వచ్చిందని వైద్యులు చెప్పారు. మద్య నిషేధం అన్నా.. అది మాటలకే పరిమితమైంది. దొరకడం ఇంకా ఎక్కువైంది. సంక్షేమ పథకాల కన్నా.. మద్యం నిషేధం అమలు చేస్తే కుటుంబాలు బాగుడపతాయి.


కిక్కు ఎక్కడం లేదని...

పిచ్చి మందు అమ్ముతున్నారు. రూ. 150 పెట్టి కొనుగోలు చేసి.. తాగి ఇంట్లో గొడవలు పెట్టుకుంటున్నారు. ఇంటి అవసరాలకూ ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. గతంలో రోజుకు ఒక్కసారే తాగేవారు. ఇప్పుడు కిక్కు ఎక్కడం లేదని మూడు పూటలా తాగుతున్నారు. కిడ్నీలు చెడిపోతున్నాయి. తలనొప్పితో బాధపడుతున్నారు. మద్యం షాపులు తీసేస్తానని చెప్పి మాట మార్చారు.

రాణి, నెల్లూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని