logo

కాలనీల్లో కష్టాలు.. ఇంకా ఎన్నాళ్లు?

పట్టణంలోని పలు కాలనీలు కీలకమైన మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించే నాధులే లేకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 10 May 2024 04:29 IST

న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం

ట్టణంలోని పలు కాలనీలు కీలకమైన మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించే నాధులే లేకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, కాలువలు వంటి వాటి గురించి పట్టించుకుంటున్న దాఖలాల్లేకపోవడం వైకాపా పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రమంతటా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైకాపా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి తిరిగి సమస్యలు గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు చొప్పున కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కానీ, రాష్ట్రంలో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో జరిగినా కందుకూరు మున్సిపాలిటీలో మాత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించలేదు. దీంతో నిధుల మంజూరు సంగతి అటుంచి కనీసం సమస్యలు గుర్తించిన వారే లేకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్లపైనే మురుగు ప్రవాహం

పట్టణంలోని 17, 18, 19, 20 వార్డుల పరిధిలో మంగళిపాలెం, వినాయకస్వామిగుడి ప్రాంతం, కాళిదాసువారివీధి, పాత ఆంధ్రాబ్యాంకు బజారు తదితర ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య నెలకొంది. మంగళిపాలెంలో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణమంతా ఉదయం పూట సరఫరా అవుతుంటే.. మంగళిపాలెంలో మాత్రం సాయంత్రం 6 తరువాత సరఫరా చేస్తున్నారు. అది కూడా పట్టుమని పది బిందెలు రావడం లేదంటున్నారు. కాళిదాసువారివీధిలో చెత్త సమస్య తీరడం లేదు. కాలువలు సక్రమంగా లేక మురుగునీరు నిల్వ ఉంటోంది. కొన్ని వీధుల్లో రామతీర్థం పైపులైన్లు, కుళాయిల కోసం రోడ్డును పగలగొట్టారు. మరలా కాంక్రీటుతో మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆయా వీధులు గతుకులమయంగా ఉన్నాయి. మంగళిపాలెం నుంచి బైపాస్‌రోడ్డుకు వెళ్లే వీధుల్లో కాలువలు, చప్టాలు పగిలి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ఆయా వార్డులన్నిటిలో మురుగు కాలువల సమస్య తీవ్రంగా ఉంది.


నీరు సరిగా రావడం లేదు

-మాలతి, మంగళిపాలెం

మాకు సాయంత్రం 6 తరువాత రామతీర్థం నీరు సరఫరా అవుతోంది. చాలా కాలం నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు. ఇటీవల అయితే పది బిందెలు కూడా రావడం లేదు. ఎండాకాలం కావడంతో నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కో రోజు నీళ్లు వాసన వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని