logo

సమస్యల వాడలు.. పట్టని పాలకులు

పట్టణంలోని పాతూరుతో సహా సమీప ప్రాంతాల్లోని వార్డుల్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఛిద్రమైన రహదారులు.. పూడికతో నిండిన కాలువలతో నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు.

Published : 10 May 2024 04:32 IST

న్యూస్‌టుడే, కావలి

ట్టణంలోని పాతూరుతో సహా సమీప ప్రాంతాల్లోని వార్డుల్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఛిద్రమైన రహదారులు.. పూడికతో నిండిన కాలువలతో నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు. పాలకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలం చెల్లిన పైపులైన్లు తరచూ లీకులు పడడంతో నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరగడంతో విషపురుగులు చేరుతున్నాయి. 5,6,7 వార్డుల్లోకి వచ్చే పాతూరు, ఈతకోటవారి వీధి, వెంగాయగారిపాలెం, కొనదిన్నె గిరిజన కాలనీల్లో  మురుగుకాలువల్లో ప్రవాహం ముందుకెళ్లడం లేదు. ఇటీవల రూ.40 లక్షల వంతున ఒక్కో సచివాలయానికి నిధులు మంజూరుచేశారు. వీటితో చేస్తున్న పనుల్లో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంగాయగారిపాలెం, కొనదిన్నె గిరిజన కాలనీల్లో వీధి కుళాయిలే లేవు.  

8,9,10,11 వార్డుల పరిధిలో షాదీమంజిల్‌, వివేకానంద పార్కు, అళహరివారి వీధి, గంగమ్మ ఆలయ కూడలి, శివాలయం వీధి, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు నిత్యం హాజరుకావడం లేదనే విమర్శలున్నాయి. రోడ్లను శుభ్రం చేసి చాన్నాళ్లవుతుందంటున్నారు. దీంతో చెత్తకుప్పలతో దుర్వాసన వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని వీధుల్లో రోడ్లకు పక్కనే పిచ్చి మొక్కలు మొలిచాయి. దోమల బెడద అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


దోమల సమస్యకు పరిష్కారం చూపాలి

-పోలు వెంకటేశ్వర్లు, పాతూరు

దోమల సమస్యకు పరిష్కారం చూపాలి. అన్ని కాలనీల్లో ఈసమస్య ఉంది. వీటితో వ్యాధులకు గురవుతున్నాం.


పారిశుద్ధ్యం మెరుగుపరచాలి

-ఈవీఎస్‌ రామారావు, ఎస్పీ కాలనీ

చాలా వీధుల్లో మాత్రం పారిశుద్ధ్య సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. నిత్యం కాలువల్లో పూడిక తీయడంతో పాటు చెత్త శుభ్రం చేయడం లేదు. వీరిపై పర్యవేక్షణ పెంచాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని