logo

యంత్రాలపై అందని రాయితీ

ఆరుగాలం ఎండకు, వానకు ఓర్చి స్వేదం చిందించి పంటలు సాగు చేస్తున్నారు రైతులు. వారికి ప్రకృతి సహకరిస్తేనే పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది.. ఎంతో కొంత మిగులుతుంది.

Published : 23 May 2024 02:10 IST

భారంగా మారిన వ్యవసాయం
న్యూస్‌టుడే, ఆర్మూర్‌ గ్రామీణం

యంత్రంతో ఎర్రజొన్న పంట కోస్తున్న రైతులు

రుగాలం ఎండకు, వానకు ఓర్చి స్వేదం చిందించి పంటలు సాగు చేస్తున్నారు రైతులు. వారికి ప్రకృతి సహకరిస్తేనే పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది.. ఎంతో కొంత మిగులుతుంది. సాగుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం అనేక పరికరాలు, యంత్రాలు రాయితీపై అందించేది. అది కాస్త మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం సబ్సిడీపై ఎలాంటి యంత్రాలు, పరికరాలు అందించడం లేదు. దీనికి తోడు రోజురోజుకు సాగు ఖర్చులు పెరిగిపోయి భారంగా మారాయి.

2018లో అటకెక్కింది..

రోటవేటర్‌పై 50 శాతం సబ్సిడీ, 33 శాతంపై పిచికారీ పరికరాలు రైతులకు అందజేసింది. కూరగాయ విత్తనాలతో పాటు ట్రాక్టర్లు, స్ప్రే పంపులు, కలుపుతీసే యంత్రాలు, వరి కోత మిషన్‌లు, టార్పాలిన్‌ కవర్లు సబ్సిడీపై అందించేవారు. భారాస ప్రభుత్వ తొలిసారి అధికారంలోకి వచ్చాక యంత్రలక్ష్మీ పథకంతో యంత్రాలపై 50 శాతం రాయితీ కల్పించింది. 2018 తర్వాత ఈ పథకం అటకెక్కింది. రైతులు యంత్రాలను కొనుగోలు చేసే పరిస్థితి లేక కూలీలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. 

పరికరాలతో మేలు

వ్యవసాయ పనుల్లో యంత్రాలు వినియోగించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగుకు అవకాశం ఉంటుంది. విత్తనాలు వేయడం, పంట కోత వరకు అన్ని పనులు యంత్రాలతో చేయడం ద్వారా సమయం, కూలీల కొరత తీరడంతో పాటు ఖర్చులు ఆదా అవుతాయి. వరి కోతల సమయంలో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోత యంత్రాలు కొనుగోలు చేయడం రైతులకు భారం అవుతుంది. దీంతో అద్దెకు తీసుకువచ్చి పనులు పూర్తి చేసుకుంటున్నారు. వరి కోత యంత్రాలకు సబ్సిడీ అందిస్తే ఇబ్బందులు దూరం అవుతాయని రైతులు అంటున్నారు.

సాగు ఖర్చులు ఆదా

ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి సాగు ఖర్చులు ఆదా అవుతాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ యంత్రాల రాయితీ విషయంలో ఇంత వరకు ఎలాంటి నిర్ణయం చేయలేదు. రాయితీ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని