logo

రేషన్‌ దుకాణాల వద్ద టీకా

జిల్లాలో మొదటి డోసు టీకా పంపిణీ 87 శాతం మేర జరిగింది. ఈ నెల 15వ తేదీ కల్లా నూరుశాతం పూర్తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రెండో డోసు 35 శాతం మందికి వేయగా గడువు తేదీ ఆధారంగా ఈ నెలాఖరు వరకు అర్హులకు టీకా అందేలా చర్యలు చేపడుతున్నారు.

Updated : 05 Dec 2021 06:19 IST

నిజామాబాద్‌ నగరంలోని కసాబ్‌గల్లీలో రేషన్‌ దుకాణం ఎదుట వ్యాక్సిన్‌ వేస్తున్న ఆరోగ్యశాఖ సిబ్బంది

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం : జిల్లాలో మొదటి డోసు టీకా పంపిణీ 87 శాతం మేర జరిగింది. ఈ నెల 15వ తేదీ కల్లా నూరుశాతం పూర్తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రెండో డోసు 35 శాతం మందికి వేయగా గడువు తేదీ ఆధారంగా ఈ నెలాఖరు వరకు అర్హులకు టీకా అందేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం నిజామాబాద్‌ అర్బన్‌లో 87 రేషన్‌ దుకాణాల వద్ద ప్రత్యేకంగా వైద్యసిబ్బందిని ఏర్పాటు చేసి టీకా వేశారు. రోజువారితో పోల్చితే అదనంగా 3 వేల మంది టీకా తీసుకున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి శివశంకర్‌ తెలిపారు.

డీలర్లతో వాగ్వాదం

వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు ఆధారం చూపితేనే రేషన్‌ ఇస్తామంటూ శనివారం కొందరు రేషన్‌ డీలర్లు చెప్పడం వివాదానికి కారణమైంది. మాలపల్లి, అహ్మదీబజార్‌, శివాజీనగర్‌, అర్సపల్లి ప్రాంతాల్లో పలువురు డీలర్లతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు టీకా ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రాలకు పరుగులు తీశారు. ఇదే అదునుగా భావించిన నిర్వాహకులు అదనపు వసూళ్లకు పాల్పడ్డారు. అర్సపల్లి, మాలపల్లి, పెద్దబజార్‌ ప్రాంతాల్లో నగర పాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌ చిత్రామిశ్రా తనిఖీ చేశారు.

యథావిధిగా రేషన్‌..

దీనిపై జిల్లా కలెక్టర్‌, పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించారు. రేషన్‌ విషయంలో ఎలాంటి నిర్బంధ ఆదేశాలు లేవన్నారు. గత నెలలో మాదిరిగానే రేషన్‌ పంపిణీ చేస్తామని స్పష్టతనిచ్చారు. కేవలం వ్యాక్సినేషన్‌ తక్కువగా జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిపెట్టి టీకాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు.

రేషన్‌ కార్డులు: 4,06,152

బియ్యం కోటా: 7,500 మెట్రిక్‌ టన్నులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని