logo

జన గణనకు సన్నాహాలు

జనగణనకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైన సిబ్బంది, జిల్లా మ్యాపింగ్‌ వివరాలను రాష్ట్ర యంత్రాంగానికి ఇప్పటికే నివేదించారు. పదేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియ రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది.

Published : 25 Jan 2022 03:12 IST

వివరాలు సేకరిస్తున్న అధికారులు

వేసవిలో చేపట్టే అవకాశం

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

జనగణనకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైన సిబ్బంది, జిల్లా మ్యాపింగ్‌ వివరాలను రాష్ట్ర యంత్రాంగానికి ఇప్పటికే నివేదించారు. పదేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియ రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. 2011లో చివరి సారిగా చేపట్టారు. 2020లో జరగాల్సినంది.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈసారి కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను లెక్కలోకి తీసుకుంటున్నారు. వీటి ప్రకారమే చేపట్టనున్నారు.  ఈ మేరకు అధికారులు రెవెన్యూ సరిహద్దులను నిర్ధారిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్‌-మేలో జరిగే అవకాశాలున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి కామారెడ్డి కొత్త జిల్లా ఏర్పడింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి పురపాలికలుగా ఆవిర్భవించాయి. రెండు రెవెన్యూ డివిజన్లు, ఐదు కొత్త మండలాలు, 204 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. అధికారులు భౌగోళికంగా ఏ మండలాలు ఏ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్నాయో తెలిపే విధంగా నివేదికలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాలకు  అనుంబంధ ఫాం-1, పట్టణాలకు అనుబంధ ఫాం-2ను వినియోగించనున్నారు. పల్లెల్లో రెవెన్యూ గ్రామాన్ని, మున్సిపాలిటీల్లో వార్డులను యూనిట్‌గా తీసుకుని   జనగణన చేపట్టనున్నారు. మొదటి దశలో గృహాలను, రెండో దశలో జనాలను లెక్కిస్తారు.

మరోసారి శిక్షణ  ఇస్తారా..?

జనగణన ప్రక్రియను ప్రతిసారి గణాంకశాఖ నిర్వహించేది. ఈసారి రెవెన్యూశాఖకు ఆ బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి 2020లోనే పూర్తి చేయడాల్సి ఉండగా.. అప్పుడు ఆరుగురు జిల్లా అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. అనంతరం జిల్లాస్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఎస్‌వోలు, డీఎస్‌వోలకు ప్రక్రియ చేపట్టారు. అయితే కరోనా కారణంగా కార్యక్రమం ఆగిపోయింది. శిక్షణ పొందిన అధికారుల్లో ఇప్పుడు ఒక్కరు మినహా అందరూ బదిలీ అయ్యారు. దీంతో మరోమారు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఎన్యూమరేటర్లకు మండలస్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాత గణన ప్రారంభిస్తారు. 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి లెక్కింపు చేపడతారు. ఎన్యూమరేటర్లలో అధికశాతం మంది ఉపాధ్యాయులే ఉండనున్నందున వేసవి సెలవుల్లో ప్రక్రియ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

సాంకేతికత తోడు..

ఈసారి జనగణనలో సాంకేతికతను వినియోగించనున్నారు. మొబైల్‌ యాప్‌ అప్లికేషన్‌, లేదా టాప్‌ - వ్యూ - పర్సన్‌ ఐడెంటిఫికేషన్‌ పద్ధతి అవలంబించనున్నట్లు సమాచారం. ఈ విధానంతో ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో చేపట్టారు. అయితే ఏ విధానంలో చేపడతారనేదానిపై మరింత స్పష్టత రావాల్సిఉంది. ఈ విషయమై సీపీవో రాజారాం మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయుల సంఖ్య, మ్యాపింగ్‌ వివరాలను నివేదించినట్లు తెలిపారు. జనగణన తేదీలు, శిక్షణ గురించిన ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని