logo

డబ్బుల విషయంలో గొడవ.. ఒకరి హత్య

మెండోరా మండలం పోచంపాడ్‌లో కల్లుబట్టీ వద్ద చేపలు పట్టిన డబ్బుల విషయంలో దుండి ప్రవీణ్‌ కుమార్‌(28), హసన్‌బిన్‌ అలీ అలియాస్‌ సాజిద్‌ మధ్య ఆదివారం వివాదం జరిగింది.

Updated : 08 Aug 2022 05:09 IST


హత్యకు గురైన ప్రవీణ్‌కుమార్‌

బాల్కొండ, న్యూస్‌టుడే: మెండోరా మండలం పోచంపాడ్‌లో కల్లుబట్టీ వద్ద చేపలు పట్టిన డబ్బుల విషయంలో దుండి ప్రవీణ్‌ కుమార్‌(28), హసన్‌బిన్‌ అలీ అలియాస్‌ సాజిద్‌ మధ్య ఆదివారం వివాదం జరిగింది. ఈ గొడవలో సాజిద్‌ ప్రవీణ్‌కుమార్‌ను కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు, మృతుడు ఇద్దరు స్నేహితులు. కాగా, చేపలు పట్టి విక్రయించగా వచ్చిన డబ్బుల విషయంలో సాజిద్‌ను ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించగా, డబ్బులడిగి తన విలువ తీస్తున్నావనే కారణంతో కల్లుబట్టీ వద్ద గొడువ పడి హత్య చేశాడని ఆర్మూర్‌ గ్రామీణ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మృతుడు కూలీ పని చేస్తూ వచ్చిన డబ్బులతో స్నేహితులతో కలిసి మద్యం తాగి తిరిగే వాడని, ఒంటరిగా ఉండగా అదును చూసుకొని కొట్టి చంపాడని తెలిపారు. ప్రవీణ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


యువకుడి ఆత్మహత్య..

నిజామాబాద్‌ నేరవార్తలు: నగరంలోని నాందేవ్‌వాడ వంతెనపై నుంచి దూకి మోసిన్‌ అనే యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకొన్నాడు. బాబాన్‌సాహెబ్‌ పహాడ్‌కు చెందిన ఇతడు ఆదివారం ఉదయం వారధిపై నుంచి దూకాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది.


మంటల్లో కాలి నలుగురు కుటుంబ సభ్యుల మృతి..

నాందేడ్‌: రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి గాయపడిన ఇంటి యజమాని, భార్య, కుమారుడు, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈ విషాదకర ఘటన దెగ్లూర్‌ తహసీల్‌ కల్లూర్‌ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన సురేష్‌ బిరాదార్‌ (52), పొలాలకు మందులు చల్లుతూ కుటుంబాన్ని పోషిస్తారు. ఈ పని కోసం ఇంటికి పెట్రోలు తీసుకొచ్చారు. పంపులో పెట్రోలు పోస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సురేష్‌ (52), అతని భార్య గంగుబాయి, కుమారుడు కపిల్‌, కుమార్తె స్వాతి   80 శాతం కాలిపోయారు. వెంటనే వారిని నాందేడ్‌ శ్రీ గురుగోవింద్‌ సింగ్‌ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నలుగురి అంత్యక్రియలు గ్రామస్థులు నిర్వహించారు.


తాళం వేసిన ఇంట్లో చోరీ..

బోధన్‌: పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో తాళం వేసిన ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ..విజయ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ నాలుగు రోజుల కిందట విజయవాడకు బంధువుల వద్దకు వెళ్లారు. ఇంటి తాళాలు పగులగొట్టిన దొంగలు పది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేశామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని